Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గింపు, ప్రభుత్వ భూముల అమ్మకాల నిలిపివేయాలని డిమాండ్
- ఆందోళన కార్యక్రమాలను సక్సెస్ చేయాలని పిలుపు
- జిల్లా కమిటీల సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణ-సిటీబ్యూరో/ఏఎస్‌రావునగర్
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ప్రభుత్వ భూముల అమ్మకాలను నిరసిస్తూ సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్, సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, నిత్యావసర ధరలు నియంత్రించాలని, ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపి చేయాలన్న డిమాండ్‌తో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. గురువారం కాప్రాలోసి నీలం రాజశేఖరరెడ్డి భవన్(సీపీఐ కార్యాలయం)లో డీజీ.సాయిలుగౌడ్ అధ్యక్షతన సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) మేడ్చల్ జిల్లా కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాలమల్లేష్ మాట్లాడుతూ.. ఐదు కేంద్ర వామపక్ష పార్టీలు ఇచ్చిన అఖిలభారత పిలుపులో భాగంగా ఈనెల 19, 24, 30 తేదీల్లో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. పెట్రోల్ ధరల పెరుగుదల, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అందరికీ వ్యాక్సిన్ అందించకపోవడం, రైతాంగ సమస్యలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ప్రయివేటీకరణ విధానాలు, భూముల అమ్మకం, తదితర అంశాలపై పోరాటాలు ఉధృతం చేయాలన్నారు. మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ భూములను అమ్మడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఆ భూములను పేద, మధ్యతరగతి ప్రజల గహ అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తే సగం ధరకే పెట్రోల్, డీజిల్ అందించవచ్చు అన్నారు. జూన్ 19న పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలను నిరసిస్తూ మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డీజీ.సాయిలు గౌడ్ మాట్లాడుతూ.. జూన్ 24న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని చర్లపల్లిలోని చమురు సంస్థల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని, జూన్ 30న చలో రాజ్‌భవన్ నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దామోదర్‌రెడ్డి, రొయ్యల కృష్ణమూర్తి, శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.