Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓఆర్ఆర్ గ్రామాలకు అదనంగా 50 ఎంఎల్డీల నీటి కేటాయింపు
- 56 వేలకు పైగా కుటుంబాలకు తీరనున్న ఇక్కట్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ పరిధిలోని ఓఆర్ఆర్ గ్రామాలకు ఐదురోజులకోసారి నీటి నీటి సరఫరాకు జలమండలి చెక్ పెట్టింది. ఇక నుంచి డే బై డే వాటర్ సప్లరు చేయాలని, ఇందుకోసం 50ఎంఎల్డీల నీటిని అదనంగా కేటాయించాలని డిసైడ్ చేసింది. దీనివల్ల 56 వేల కుటుంబాలకు తాగునీటి ఇక్కట్ల్లు తొలుగుతాయని పేర్కొంది. జలమండలి ఎండీ దానకిషోర్ ఆదేశాలతో అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. శుక్రవారం నుంచి శివారు మున్సిపాలిటీల్లోని గ్రామాలకు రోజు విడిచి రోజు మంచి నీరు సరఫరా చేయనున్నారు.
193 గ్రామాలకు గుడ్ న్యూస్ :
జలమండలి పరిధిలోని జీహెచ్ఎంసీ వెలుపల, ఓఆర్ఆర్ లోపల మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 17 గ్రామ పంచాయితీల్లో మొత్తం 193 గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో కొన్ని ప్రాంతాలకు డే బై డే, మరికొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి 5 రోజులకొకసారి మంచినీరు సరఫరా అవుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటున్నారు. ఈ సమస్యను తీర్చడానికి రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దానికనుగుణంగా ఈ ప్రాంతాలకు ఇప్పటికే సరఫరా చేస్తున్న నీటి కంటే, 50 ఎమ్మెల్డిల నీటిని అదనంగా సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధమైంది. ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న 56 వేలకు పైగా కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. శుక్రవారం నుంచి మంచి నీటి సరఫరాను ప్రారంభించనున్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎండీ దానికిషోర్ ఆదేశాలు జారీ చేశారు.
అదనంగా 50ఎంఎల్డీలు నీరు :
శివారు గ్రామలకు రోజువిడిచి రోజు మంచినీటి సరఫరా చేస్తామని జలమండలి ఎండీ ఎం.దానకిషోర్ తెలిపారు. ఈ మేరకు గురువారం గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓఆర్ఆర్ ఓఅండ్ఎం, ట్రాన్స్మిషన్ ఉన్నతాధికారు లతో ఆయన సమావేశమయ్యారు. ఓఆర్ఆర్ గ్రామాలకు ఇప్పటికే సరఫరా చేస్తున్న నీటి కంటే అదనంగా 50ఎంఎల్డీల నీటిని కేటాయిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరాను మెరుగుపర్చడానికి కొత్త పైప్ లైన్ నిర్మాణం, మరికొన్ని ప్రాంతాల్లో ఫీడర్ మెయిన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆపరేషన్స్- 2ఎం. స్వామి, రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్, ఓఆర్ఆర్ ఓ అండ్ ఎం, ట్రాన్స్మిషన్ సీజీఎంలు, జీఎమ్‌లు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.