Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ ఏరియా ఆస్పత్రి నుంచి నీలోఫర్ తీసుకెళ్తుండగా ఘటన
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
కాన్పుకోసమని మేడ్చల్ పట్టణం నుంచి నీలోఫర్ ఆస్పత్రికి అంబులెన్సులో వెళ్తున్న ఓ గర్భిణి మార్గమధ్యంలోనే ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన గురువారం జరిగింది. మేడ్చల్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసముండే గర్భిణి పి.లక్ష్మి గురువారం ఉదయం 11 గంటల తర్వాత పురిటి నొప్పులతో మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వచ్చింది. కారణాలేమిటో కానీ ఇక్కడి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత వెంటనే నీలోఫర్‌కు వెళ్లాలని రిఫర్ చేసింది. దీంతో 108 అంబులెన్సులో గర్భిణి లక్ష్మిని నీలోఫర్ తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సిటీలోని ట్యాంక్‌బండ్ వద్దకు రాగానే మధ్యాహ్నం 1:10 గంటల సమయంలో సదరు మహిళ అంబులెన్స్‌లోనే నార్మల్ డెలివరీ అయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే మేడ్చల్ పట్టణంలోని ఆస్పత్రికి, సదరు గర్భిణి ఆరోగ్యంగానే ఉన్నా అక్కడే కాన్పు కాన్పుచేయకుండా నీలోఫర్‌కు ఎందుకు రిఫర్ చేశారని ప్రసవించిన మహిళ తరపువారు ప్రశ్నించారు. ఇక్కడ తరచూ ఇలాగే చేస్తుంటారని, ఇక్కడి డాక్టర్ రిఫరల్‌కే ప్రాధాన్యత ఇస్తారని కూడా కొందరు విమర్శిస్తున్నారు.రిఫర్ చేయకుండా ఇక్కడే కాన్పులు జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఇదే విషయమై డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ ఆనంద్‌ను వివరణ కోరగా విచారించి రిఫర్ చేసిన డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.