Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయోమయంలో ఓపెన్ స్కూల్ విద్యార్థులు
- జిల్లాల్లో టెన్త్, ఇంటర్ 15,580 మంది విద్యార్థులు
- విద్యార్థులను కలవరపెడుతున్న ప్రవేశాల ప్రకటనలు
కరోనా నేపథ్యంలో విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలలు, కాలేజీలకు తాళాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు విద్యార్థులు నష్టపోకుండా నివారణ చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా తొలుత రెగ్యులర్‌కు సంబంధించి ఒకటి నుంచి టెన్త్ వరకు, ఆ తర్వాత ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేసింది. అయితే ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థుల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంతకీ పరీక్షలు నిర్వహిస్తారా..? ప్రమోట్ చేస్తారా..? అనే సందిగ్ధంలో ఉండిపోయారు. మరోవైపు ఇతర కోర్సులకు, ప్రవేశాలకు ప్రకటనలు వెలువడతుండటంతో దిగులు చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం అటు విద్యాశాఖ అధికారులు, ఇటు విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 96 సార్వత్రిక అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ప్రవేశాలు జరిగాయి. 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి ప్రవేశాలు 10550, ఇంటర్లో 5387 మంది అభ్యాసకులు చేరగా.. మొత్తం 15,887 మంది ఉన్నారు. వీరంతా ఫీజులు చెల్లించి, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా అని నిరీక్షిస్తున్నారు. ఇదిలావుంటే చదువులు కొనసాగించలేక మధ్యలో మానేసిన వారు, కనీస విద్యార్హత లేకుండా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నవారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు పొందేందుకు టెన్త్, ఇంటర్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక విద్యా విధానం ఎంతోమందికి సదవకాశంగా మారింది. అంతేగాక ఒపెన్ ఇంటర్ తర్వాత ఉన్నత విద్య కొనసాగించాలనుకునే వారికి కూడా ఇదో అద్భుత వరంగా మారింది.
12,129 మంది పాసయ్యారు.
కరోనా లాక్డౌన్ కారణంగా 2020-21 విద్యాసంవత్సరంలో జిల్లాలో టెన్త్ అభ్యాసకులు 8157, ఇంటర్ 3972 మందిని.. మొత్తం 12,129 మంది విద్యార్థులను పాస్ చేశారు. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలో నిర్వహించాల్సిన సార్వత్రిక వార్షిక పరీక్షలు.. ఈ ఏడాది ఇప్పటివరకూ నిర్వహించలేదు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఒకటి నుంచి ఇంటర్ వరకు రెగ్యులర్ విద్యార్థులను పాస్ చేస్తూ.. పై తరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఓపెన్ విద్యార్థుల వార్షిక పరీక్షల నిర్వహణపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోక పోవడంతో స్టూడెంట్స్ కలవరపడుతున్నారు. గతేడాదిలాగే మమ్మల్ని కూడా ఉత్తీర్ణులను చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.