Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది వారాల్లో 53 మంది అరెస్ట్ 71 మందిపై కేసులు
- 11 బాల్య వివాహాలకు అడ్డుకట్ట
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల సంఖ్య పెరుగుతుండడంతో వాటిని నివారించేందుకు షీ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ఇందులో భాగంగా ఎక్కడిక్కడ పోకిరీల ఆగడాలకు అడ్డుకట్టవేస్తూ భద్రతపై మహిళలకు భరోసా కల్పిన్నాయి ఈ టీమ్‌లు. ప్రత్యేక నిఘా వేస్తూ పోకిరీల ఆటకట్టిస్తున్నాయి. గృహిణులు, విద్యార్థినులు, ఉద్యోగస్తులకు రక్షణ కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది వారాల్లో 53 మంది ఈవ్‌టీజర్లను షీ టీమ్స్ అరెస్టు చేశాయి. 71 కేసులను నమోదు చేశాయి. ఇదిలావుండగా 11 బాల్య వివాహాలను అడ్డుకున్నాయి.
వాష్‌రూమ్‌లో..
మేడిపల్లిలో నివాసముంటున్న ఓ ప్రభుత్వోదిగిని ప్రతిరోజూ ఉదయం డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండేది. ఎప్పటిలాగే ఓ రోజు ఇంటికొచ్చి వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. అయితే పక్కనే ఉన్న వెంటిలేటర్వద్ద ఆమెను ఎవరో గమనిస్తున్నట్టు గుర్తించింది. ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పడంతో అలా గమనిస్తున్న పోకిరీని పట్టుకున్నారు. ప్రయివేట్ సంస్థలో పనిచేస్తున్న జే.శ్రావణ్ కుమార్‌గా గుర్తించిన పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు.
వేధింపులకు గురి చేస్తున్న మామపై కేసు
ప్రయివేట్ సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళను తన భర్త తండ్రి (మామ 65) వేధించడం మొదలు పెట్టాడు. వనస్థలిపురంలో నివాసముంటున్న వారు నివాసం ఉంటున్నారు. ఇంట్లో నిద్రపోతున్న సమయంలోనూ మామ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బాధితురాలు షీ టీమ్‌కు సమాచారం ఇవ్వడంతో అతనిని అరెస్టు చేసి తీసుకుని కేసు నమోదు చేశారు.
మెట్రో రైల్లో చిక్కిన పోకిరీలు
మెట్రో రైళ్లలో పోకిరీలు రెచ్చిపోతుండడంతో షీ టీమ్స్ ప్రత్యేక నిఘా వేశాయి. అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్న 10 మందిని అరెస్టు చేశాయి. ఇదిలా ఉండగా ఫిర్జాదీగూడలో కొందరు పోకిరీలు అమ్మాయిల వెంటపడి వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచాంర అందుకున్న షీ టీమ్స్ డెకారు ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు పోకిరీలను అరెస్టు చేశాయి.
బాల్య వివాహాల నిలుపుదల
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాల్య వివాహాలు, మైనర్ల వివాహాలు జరగకుండా సీపీ మహేష్ భగవత్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ విధమైన పెండ్లిల్లు చేయడం చట్ట రీత్యానేరం అని ప్రజలను తెలిసే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయినా కొందరు కొందరు గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలను కానిచ్చేస్తున్నారు. రెండు నెలలకాలంలో భోనగిరి, చౌటుప్పల్, కుషాయీగూడ, ఎల్బీనగర్, ఇబ్రహీం పట్నంలో 11 పెండ్లిళ్లను పోలీసులు అడ్డుకున్నారు.
పేరెంట్స్ సమక్షంలో కౌన్సెలింగ్
మహిళలకు భరోసాగా నిలిచిన 'షీ' టీమ్‌లు సమాచారమివ్వగానే వాలిపోతున్నాయి. ప్రజల్లో ఉంటూనే నిఘా వేస్తున్నాయి. రహస్య కెమెరాలతో చిత్రీకరిస్తున్నాయి. మహిళలకు ఫోన్లుచేసి అసభ్యకరంగా మాట్లాడినా, అభ్యంతరకరమైన మెసేజ్‌లు, ఫొటోలు పంపించినా పోకిరీల తాట తీస్తున్నాయి. ఈ సందర్భంగా పట్టుబడ్డ మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పోకిరీలను దోషులుగా కోర్టులో నిలబెట్టేందుకు వీడియో సాక్ష్యాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.
రెండోసారీ నిర్భయ కేసు : సీపీ
మహిళల భద్రతే లక్ష్యంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పరిధిలో 'షీ' టీమ్‌లు ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈవ్‌టీజింగ్ చేస్తున్నవారు రెండోసారి పట్టుబడితే నిర్భయ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. మహిళలను చైత్యనపర్చేందుకు పోస్టర్లు, కరపత్రాలతోపాటు, ఉద్యోగ, విద్యాసంస్థలల్లో అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అభద్రతాభావాన్ని తొలిగించేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నామని, ఎవరైనా మహిళలను వేధింపులకు గురిచేస్తే బాధితులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. 949061711 నెంబర్‌కు లేదా డయల్ 100 కు సమాచాంర ఇవ్వాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.