Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కష్టాల్లో ఆదుకోవాల్సిందిపోయి ధరలు పెంచి దోచుకునుడేంది?
- పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలె
- పలుచోట్ల సీపీఐ(ఎం), వామపక్షాలు, ప్రజా సంఘాల నిరసనలు
నవతెలంగాణ-దుండిగల్
జనమంతా కరోనా కష్టాల్లో ఉంటే.. అసలే పనుల్లేక, ఉపాధిలేక, చేతిలో పైసల్లేక జనం తండ్లాడుతుంటే.. ఆదుకోవాల్సిందిపోయి కొంచెమైనా కనికరం లేకుండా, మానవత్వం లేకుండా కేంద్ర సర్కారు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుడు ఎంతవరకు సమంజసమని పలువురు వామపక్ష నేతలు, ప్రజా సంఘాలు నేతలు, ప్రజలు ప్రశ్నించారు. కేంద్రం ధరలు పెంచుతుంటే, రాష్ట్ర సర్కారు కూడా నోరు తెరవడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలను మరింత కష్టాల్లోకి నెడుతున్నాయని ఆరోపించారు. జనంపట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరల పెంపుపై శనివారం వామపక్షాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల సీపీఐ(ఎం), సీపీఐ, ఇతర వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, వినూత్న నిరసనలు, ర్యాలీలు చేపట్టిన్రు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి, ఉప్పల్, బాలానగర్ తహసీల్దార్ ఆఫీసుల ఎదుట, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో సీపీఐ(ఎం) వామపక్షాల నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. తుర్కయాంజల్ చౌరస్తాలో టాటా ఏస్ ఆటో ట్రాలీ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆటోలను తాళ్లతో లాగి నిరసన వ్యక్తం చేశారు. బడంగ్పేట్లోనూ, వనస్థలిపురం పనామా గోడౌన్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.