Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజు కడితేనే.. పై తరగతులకు ప్రమోట్
- ఈ ఏడాది ఆన్లైన్ క్లాసులకు లింక్
- విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లో సందేశాలు
- ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ప్రయివేటు స్కూళ్లు..!
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యార్థుల తల్లిదండ్రులకు మళ్లీ ప్రయివేటు పాఠశాలల నుంచి టార్చర్ మొదలైంది. ఈ అబ్బాయి లేదా అమ్మాయికి సంబంధించి గత విద్యసంవత్సరం ఫీజు పెండింగ్ ఉందంటూ ఫోన్లు చేస్తున్నారు. ఫీజు కడితేనే పై తరగతులకు ప్రమోట్ చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రుల బెదిరింపులకు గుర్తిచేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం విద్యాసంస్థలను ప్రారంభించుకోవాలని ప్రకటించింది. అయితే ఆన్లైన్? ఆఫ్లైన్ తరగతులా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. దానికితోడు ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు సైతం విడుదల చేయలేదు. కానీ ప్రయివేటు విద్యాసంస్థలు మాత్రం ఒక్క అడుగు ముందుకేసి.. నేటి నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభిస్తున్నట్టు పేరెంట్స్కు సమాచారం అందిస్తున్నాయి. ముందుగా ఫీజులు చెల్లించిన వారినే పై తరగతులకు పంపి, పాఠాలు వినేలా అవకాశం కల్పిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాయి. అంతేగాక పాత పెండింగ్ ఫీజుతో పాటు ప్రస్తుత విద్యాసంవత్సరం మొదటి టర్మ్ ఫీజు కట్టి ఆన్లైన్ క్లాసులకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేకుంటే లింక్ పంపించామని తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
ఫీజు కట్టకపోతే.. నో ఆన్లైన్ లింక్
కరోనా దెబ్బకు పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉపాధి కోల్పోయి.. ఆదాయాల్లేక ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నాయి. ఫీజులు కట్టే పరిస్థితి లేదు. ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం గతేడాది ఆన్లైన్ తరగతులకు అనుమతిచ్చింది. అదే సమయంలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రయివేటు పాఠశాలలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయకుండా నెలకు ట్యూషన్ ఫీజు మాత్రమే చెల్లించుకునేలా ఆదేశాలు ఇచ్చింది. కానీ ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నాయి. తల్లిదండ్రులను ఫీజుల పేరుతో హింసిస్తున్నాయి. అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గతేడాది పెండింగ్ ఫీజుతోపాటు ఈ ఏడాది ఫస్ట్ టర్మ్ చెల్లించి పుస్తకాలు తీసుకెళ్లి.. టీచర్లు చెప్పే పాఠాలు వినాలని చెబుతుండడం విశేషం. ఇక తాము చెప్పినట్టు ఫీజు కట్టకపోతే పై తరగతులకు ప్రమోట్ నిలిపివేస్తామని, పెండింగ్ ఫీజు కట్టాలని డిమాండ్ చేస్తున్నట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను స్కూళ్లకు పంపాలన్న.. టీచర్లు ఫోన్లు చేస్తుంటే భయపడితున్నారు.
ఫీజులు, పుస్తకాల పేరుతో దోపీడీ!
హైదరాబాద్ జిల్లాలో 1700కుపైగా ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సమారు 7.5లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. నగరంలో రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 23 నుంచి ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని విద్యా సంస్థలు బంద్ పెట్టింది. తిరిగి ఆన్లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చింది. అయితే సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితులు లేకపోవడంతో టెన్త్ పరీక్షలు రద్దుచేయడంతో పాటు 1-9వ తరగతి వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలను జులై 1 నుంచి పున:ప్రారంభించుకోవచ్చునని చెప్పింది. కానీ ప్రయివేటు పాఠశాలలు మాత్రం 2021-22 విద్యాసంవత్సరం సంబంధించి ఈనెల 21 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభిస్తున్నామని, అందుకుగాను పేర్లు నమోదు చేసుకోవాలని చెబుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని చెప్పిన ప్రయివేటు యాజమాన్యాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. పెండింగ్ ఫీజుతో పాటు ఈ ఏడాది ఫీజులు వసూలు చేసే పనిలో పడ్డాయి. పుస్తకాలు, దుస్తులు కోనుగోలు చేయాలని తల్లిదండ్రులకు చెప్పడం గమనార్హం.
ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి..
కరోనా నేపథ్యంలో పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వలేక పూట గడవక సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్లిష్ట సమయంలో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించమని విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఫీజులు చెల్లించే పరిస్థితుల్లో లేమని చెప్పినా స్కూల్ యాజమాన్యాలు పట్టించుకోకపోగా.. ఫీజు చెల్లిస్తేనే పై తరగతులకు ప్రమోట్ చేస్తామని, లేకుంటే అదే తరగతికి పరిమితం చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేయలేక ఎవరికి చెప్పుకోలేక తమలో తామే ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం, అధికారులే ప్రత్యేక చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు.