Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ నేత, మాజీ ఎంపీ అజీజ్ పాషా
- కేంద్రం వైఖరిపై నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-సిటీబ్యూరో
శాంతికాముకులైన లక్షద్వీప్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను, ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేసేందుకే ప్రధాని మోదీ ఆదేశాలకనుగుణంగా లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ ఏకపక్ష, క్రూరమైన, ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్‌పాషా మండిపడ్డారు. సోమవారం నారాయణగూడ వైఏంసీఏ కూడలివద్ద హైదరాబాద్జిల్లా సీపీఐ-ఇన్సాఫ్ల సంయుక్తాధ్వర్యంలో 'లక్షద్వీప్‌ను రక్షించండి- ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' అని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్బంగా సీపీఐ-ఇన్సాఫ్ శ్రేణులు ప్లకార్డులు చేతబూని లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, కేంద్ర ప్రభుత్వానికి వ్యతరేకంగా నినాదాలు చేస్తూ, పోరాటం చేస్తున్న లక్షద్వీప్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనకు హాజరైన అజీజ్‌పాషా మాట్లాడుతూ.. లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (2021) పేరుతో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ లక్షద్వీప్‌లో సుమారు 70,000 మంది నివాసితుల జీవితాలను, పర్యాటకం, పశువులు, పంచాయతీ ఎన్నికలను నియంత్రించే దుశ్చర్యలను చేపడుతున్నదని దుయ్యబట్టారు. 97 శాతం ద్వీపాలు సహజమైన అడవులతో నిండిఉన్న, జనాభాలో 95 శాతం రక్షిత షెడ్యూల్డ్ తెగ వర్గానికి చెందిన వారు కావడంతో వారి పాత్ర, గుర్తింపును ధ్వంసం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అడ్మినిస్ట్రేటర్ తన పక్షపాత, తిరోగమన నిర్ణయాలతో ముందుకు వెళ్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని, కేంద్ర ప్రభుత్వం ప్రఫుల్ పటేల్‌ను రీకాల్ చేయాలని అయన డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆర్. శంకర్‌నాయక్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లాV్ాఖాద్రి, ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు బి.స్టాలిన్, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కమతం యాదగిరి, శంషుద్దీన్, ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆర్. బాలకష్ణ, నిర్లేకంటిశ్రీకాంత్, ఇన్సాఫ్ నగర నాయకులు షేక్ నదీమ్, ఎస్కె మహమూద్, అమీనా, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.