Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 16 వేల మంది విద్యావాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యా వాలంటీర్లు, బీసీ నేతలతో కలిసి సోమవారం బషీర్ బాగ్లోని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈసందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రిజర్వేషన్ ఆధారంగా డిస్ట్రిక్ లెవల్ కమిటీ వెబ్ నోటిఫికేషన్ ద్వారా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన కోసం రాష్ట్రంలో 16 వేల మంది విద్యా వాలంటీర్లను సెలెక్ట్ చేసి విధుల్లోకి తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం విద్యావాలంటీర్లు కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 24 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో అర్హత కలిగిన 16 వేల మంది విద్యావాలంటీర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, విద్యాశాఖ అధికారులు ఈ విషయంలో వెంటనే స్పందించి, విద్యా వాలంటీర్ల కష్టాలు తీర్చాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్ట బబ్లూ, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులు చంటి ముదిరాజ్, జి.అంజి, హరి, విద్యా వాలంటీర్లు నిఖిల్, అరుణ, అప్సర, ఫాతిమా, సుమ, రేఖ, నవనీత తదితరులు పాల్గొన్నారు.