Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాతాల్లో నేటికీ జమకాని జూన్ నెల సాయం రూ.2వేలు
- 25 కిలోల బియ్యం పంపిణీపై స్పష్టత కరువు
- పరేషాన్లో 32వేలకుపైనే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్
- మరో రెండు నెలలు కొనసాగించాలని పలువురు టీచర్ల విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలు బంద్ కావడంతో ప్రయివేటు సిబ్బంది ఉపాధి కోల్పో యారు. ఫలితంగా ఆర్థిక కష్టాలు తోడై అవస్థలు పడుతున్న వారికి ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు నందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్, మే మాసాలకు సంబంధించి ఆపత్కాలపు సాయాన్ని ఆయా నెలల్లోని 20-22వ తేదీల్లోగా వారివారి ఖాతాల్లో నగదు జమ చేయగా.. బియ్యం కూడా అందాయి. వీరిలో యూడైస్‌లో నమోదు అయినవారు, నమోదు కాకుండా పాఠశాలల్లో పనిచేస్తున్న హైదరాబాద్ జిల్లాలో సుమారు 32709 ఉండగా.. వీరందికి లబ్ధి చేకూరింది. అదేవిధంగా దాదాపు 1140 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అందుకున్నారు. ఇంతవరకు బాగుంది. అయితే జూన్ నెలకు సంబంధించి సాయంపై స్పష్టత కరువైంది. గడువు తేదీ దాటిపోతున్నా నేటికీ లబ్ది దారుల ఖాతాల్లో 2వేల నగదు జమ కాలేదు. కనీసం బియ్యం పంపిణీపై కూడా ప్రభుత్వం గానీ విద్యాశాఖ అధికారులు గానీ స్పష్టత ఇవ్వలేదు. అంతకుముందు సాయానికి సంబంధించి ఆనెల 10వ తేదీలోపే ఉత్తర్వులు ఇచ్చిన సర్కారు.. ఈనెల ఇప్పటివరకు ఆదేశాలు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది ఆందోళ నకు గురువుతున్నారు. మరోవైపు జులై 1 నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల పున:ప్రారంభించు కోవాలని ఇటీవల క్యాబినెట్ ఒకే చేసింది. కానీ దీనిపై ఇంకా కూడా అనిశ్చితి కొనసాగుతోంది. ఇంకొవైపు పాఠశాలలు ప్రారంభం అయి.. పాఠాలు మొదలు పెట్టినా.. ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తమకు ఉద్యోగాలు ఇస్తాయా? ఇస్తే జీతాలు చెల్లిస్తారా? అనే సందిగ్థంలో టీచర్లు ఉన్నారు. ఇప్పటికే నష్టాల పేరిట ఎంతోమంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించిన విషయం విదితమే. కాగా కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్, అన్‌లాక్ కారణంగా వేరే ఉద్యోగాలు చూసుకునేందుకైనా కనీసం రెండు నెలల సమయం పడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అపత్కాలం సాయాన్ని మరో రెండు నెలలు పాటు కొసాగిస్తే బాగుంటుందని పలువురు టీచర్లు కోరుతున్నారు. ఇది తమ కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని, ప్రభుత్వ నిర్ణయంపైనే లక్షలాది మంది ప్రయివేటు టీచర్లు, సిబ్బంది ఆకలి బాధలు ఆధాపడి ఉన్నాయని చెబుతున్నారు.
ప్రయివేటు సిబ్బందికి భృతి కొనసాగించాలి : టీఎస్టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్
రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు రెండు నెలలుగా అందిస్తున్న కరోనా ఆపత్కాలపు సాయం రూ.2వేలు, 25కిలోల సన్న బియ్యం పంపిణీని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జూన్ నెలకు సంబంధించి ఆర్థిక సహాయం నేటికీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాతాల్లో జమ కాలేదు. సీఎం, సంబంధిత మంత్రి బడులు తెరిచేవరకు ఇస్తామన్న కరోనా భృతి వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
టీచర్లకు ఆర్థిక సాయం ఏడాదంతా ఇవ్వాలి : రాచకొండ నవీన్ చారి, బోధ స్కూల్,
సాహెబ్ నగర్, హైదరాబాద్
పాఠశాలలు పున:ప్రారంభమై నా ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయం ఏడాది పాటు ఇవ్వా లి. బడులు ఓపెన్ అయి.. పాఠాలు షురువైనా ప్రయివేటు యాజమాన్యాలు నెల వరకు జీతాలు ఇవ్వవు. అందులో విద్యార్థులందరూ ప్రత్యక్ష లేదా పరోక్ష క్లాసులకు హాజరై.. సకాలంలో ఫీజులు చెల్లిస్తేగానీ.. యాజమాన్యాలు తమకు జీతాలు చెల్లించే పరిస్థితి ఉండదు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తోన్న రూ.2వేల ఆర్థిక సాయం, 25కేజీల బియ్యం కోసం లక్షలాది కుటుంబాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి.