Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర సీపీ అంజనీ కుమార్
నవతెలంగాణ-కంటోన్మెంట్
దేశంలోకెల్లా అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరంగా హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉందని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం కార్ఖానా పోలీస్స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 46 సీసీ కెమెరాలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని నగరాల్లోకెల్లా హైదరాబాద్లోనే అత్యధికంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. నేరాల నియంత్రణకు, నేరస్తులను త్వరితగతిన పట్టుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. నగరంలో 3 లక్షల 85 వేల కెమెరాలు ఉన్నాయని, రాబోయే కాలంలో మరిన్ని కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే సాయన్న తన నిధుల నుంచి రూ.40 లక్షలు సీసీ కెమెరాలకోసం కేటాయించారని, అలాగే సహకరించిన మిగతా దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రూ.15లక్షల ఎమ్మెల్యే నిధులతో చేపట్టనున్న పోలీస్స్టేషన్ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తూ లాక్డౌన్ సమయంలో వంటలువార్పులు ఎంతగానో సహకరించిన శంకర్ ఇటీవల మరణించడంతో అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు కార్ఖానా పోలీసులు సేకరించిన రూ.50 వేలు విరాళాల చెక్కును సీఐ మధుకర్ స్వామి ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అందజేశారు. వ్యాపారవేత్త అగర్వాల్ కూడా శంకర్ కుటుంబానికి రూ. 25 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సామాజిక సేవచేస్తున్న జోన్పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వారుమొక్కలను నాటారు. కార్యక్రమంలో జోన్ ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ శ్రీనివాస్, మహిళా నాయకురాలు నివేదిత పాల్గొన్నారు.