Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యాధునిక చికిత్సతో మహిళ ప్రాణాలు కాపాడిన వైద్యులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
తరచుగా రుతుక్రమం సరిగా లేకపోవడంతో సంతానం కలగకపోవడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అది తీవ్రమైన సమస్యల వల్ల అయి ఉండొచ్చు. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ 25 ఏండ్లకు పెళ్లి చేసుకున్నారు. పిల్లల్ని కందామనుకుంటే రుతుక్రమం సరిగా ఉండేది కాదు. కానీ ఆమె ఈ విషయమై ఏ డాక్టర్ వద్దకూ వెళ్లకుండా నిర్లక్ష్యం చేశారు. దాంతోపాటు ఆమె ఎడమకన్నులో మెల్ల ఉంది. దాంతో క్రమంగా చూపు తగ్గింది. ఈ సమస్య తీవ్రతను గుర్తించేందుకు ఆమెకు మూడేండ్లు పట్టింది.
2020లో ఆమె ఒక గైనకాలజిస్టును సంప్రదించగా, ఈ సమస్యలన్నింటికీ కారణం కోసం ఆమె పరీక్షలు చేయించారు. హార్మోనల్ ప్రొఫైల్ చేయించగా సంతానం కలిగించే హార్మోన్లు సరిగా లేవని తెలిసింది. మెదడుకు ఎంఆర్ఐ చేయించగా, అన్ని హార్మోన్లకు కీలకమైన పిట్యుటరీ గ్రంధిలో కణితి కనిపించింది. అది మన చూపునకు అత్యంత కీలకమైన ఆప్టిక్ చియాస్మా, ఆప్టిక్ నెర్వ్లను నొక్కుతోంది. ఈ పరీక్షలతో.. ఆమె సంతానరాహిత్యానికి, చూపు తగ్గడానికి కారణం పిట్యుటరీ గ్రంధిలో ఉన్న కణితి అని నిర్ధారణ అయ్యింది.
ఆమె మెడికవర్ కేన్సర్ ఆసుపత్రిలో డాక్టర్ లహరి చాణక్య వద్దకు వెళ్లగా, రేడియోథెరపీ చేయాలని చెప్పారు. ఆమెకు డాక్టర్ లహరి చాణక్య, డాక్టర్ వినోద్, డాక్టర్ రేష్మలతో కూడిన వైద్యబందం అన్ని విషయాలూ వివరంగా చెప్పి.. చికిత్స గురించి ఉన్న భయాలు, అపోహలను తొలగించారు. ఆమె సమస్య అందించిన చికిత్స గురించి మెడికవర్ ఆసుపత్రిలోని కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ లహరి చాణక్య ఇలా వివరించారు. 'కణితి బాగా పెద్దదిగా ఉండటం, దాని చుట్టూ కీలక నిర్మాణాలు ఉండటంతో చికిత్స మాకు సవాలుగానే నిలిచింది. ఫ్రాక్షనేటెడ్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ (ఎఫ్ఎస్ఆర్ఎస్) పద్ధతిలో 5 సెషన్లు చేశాం. చుట్టుపక్కల ప్రాంతాలకు రేడియేషన్ ప్రభావం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆమె పూర్తి అంధురాలు కాకుండా కాపాడగలిగాం. అనవసర భయాలతో చికిత్స ఆలస్యం చేయడం వల్లే ఆమెకు ఇంత పరిస్థితి తలెత్తింది' అన్నారు.