Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ కమిషన్ సభ్యురాలు అంజన పన్వార్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలన్నింటినీ సఫాయి కార్మికలందరకీ అందేలా చూడాలని సఫాయి కార్మికుల జాతీయ కమిషన్ సభ్యురాలు అంజన పన్వార్ అన్నారు. గురువారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సఫాయి కర్మచారులు (కార్మికుల) అభివృద్ధి, అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలు సకాలంలో వారికి అందుతున్నాయా? లేదా ? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, అందనట్లయితే వారికి తోడ్పాటునందించి పథకాలు అందేలా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని సూచించారు. సఫాయికార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరాలను అడిగి తెలుసుకొని వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఇండ్లు మంజూరు చేసేందుకు ప్రత్యేక కోటాను కేటాయించాలని అధికారులకు సూచించారు. ఉపాధి కల్పనలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్టేషన్లలో కర్మచారులను నియమించి వారికి ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్, మల్కాజిగిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ గోపి తదితరులు పాల్గొన్నారు.