Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలపెంపుపై వామపక్షాల నిరసనలు
- కేంద్రం వైఖరి మారాలని, ధరలు తగ్గించాలని డిమాండ్
ఓ పక్క కరోనా ప్రభావంతో జనం కష్టాల్లో ఉంటే కనీసం మానవత్వం లేకుండా ఈ ధరలు పెంచుడేందని సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఇతర వామపక్షాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో జనజీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయని, పేద, మధ్య తరగతి ప్రజలు బతకలేని పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు రాయితీలు, సబ్సిడీలు ప్రకటిస్తూ, చమురు కంపెనీలు ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇస్తూ పేదలు, మధ్య తరగతి ప్రజలను మాత్రం దోచుకోవడానికి ధరలు పెంచుతున్నారని, కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. వెంటనే ధరలు తగ్గించాలని, లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గురువారం గ్రేటర్ హైదరాబాద్‌లోని చార్మినార్, ఖైరతాబాద్, చర్లపల్లి, ఎల్బీనగర్, ముషీరాబాద్, అంబర్పేట్, జూబ్లీహిల్స్, బోరబండ, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజిగిరి ప్రాంతాలతోపాటు అన్నిచోట్ల పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు జరిగాయి.
నవతెలంగాణ-సిటీబ్యూరో
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఖైరతాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఎర్రమంజిల్‌లోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, ఖైరతాబాద్ జోన్ కార్యదర్శి గోపాస్ కిరణ్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంత ధరలు పెంచుతోందన్నారు. దీంతో ప్రజలను కష్టాల్లోని నెడుతోందని చెప్పారు. ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డప్పు నర్సింహ, పాములయ్య, రాణి, సీపీఐ(ఎం) జోన్ నాయకులు శ్రీనివాస్, ప్రవీణ్, రాధికా, మాధవి, వెంకటేష్, పాండురంగా రెడ్డి, జూబ్లీహిల్స్ నాయకులు దళి నాయుడు, బీఆర్ నాయుడు, సోమాజిగూడ డివిజన్ నాయకులు పవన్, రాము, ప్రజలు పాల్గొన్నారు.
ధూల్‌పేట్: బీజేపీ ప్రభుత్వంతోనే సబ్కా వికాస్ అని ఆ పార్టీ పెద్దలు చెప్పారు కానీ నేడు బీజేపీ ప్రభుత్వంలోనే జనం అవస్థలు పడుతున్నారని, ధరలు పెంచి జనాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అబ్దుల్ సత్తార్ అన్నారు. గురువారం చార్మినార్ ఆటో స్టాండ్వద్దకేంద్రం వైఖరిని చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
మెహదీపట్నం: సీపీఐ(ఎం) నాంపల్లి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో రేతిబౌలి పెట్రోల్ బంకుదగ్గర ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ సెంట్రల్ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం. వెంకటేష్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 28 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని, గ్యాస్ ధరలను కూడా పెంచిందన్నారు. నాంపల్లి నియోజకవర్గ కార్యదర్శి మల్లేష్, సీపీఐ(ఎం) నాంపల్లి జోన్‌కమిటీ నాయకులు సీహెచ్ వెంకట స్వామి, శంకర్ యాదవ్, శంకర్, నాయకులు బాలు, సుధాకర్, హుస్సేన్, నారాయణ, జహంగీర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు
జూబ్లీహిల్స్ : సీపీఐ(ఎం) జూబ్లీహిల్స్జోన్ కమిటీ ఆధ్వర్యంలో బోరబండ బస్టాండ్ సెంటర్లో పెట్రోల్, డీజిల్ ధరలపెంపుపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆ పార్టీ నాయకులు సాయి శేషగిరిరావు, ఆర్.అశోక్, స్వామి మాట్లాడుతూ.. కరోనా సమయంలో అన్నిరంగాల కార్మికులు ఉపాధి కోల్పోయి, అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో ప్రతి కార్మిక కుటుంబానికీ రూ. 7, 500 ఇవ్వాలని, అదేవిధంగా ఆటో కార్మికులకు ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్లు, ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ. 10 వేలు ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉప్పలయ్య, సుశీల, ఏఆర్ నరసింహ, రజినీకాంత్, విజరు, సోమేశ్, సంపత్, వెంకటేష్, గంగులప్ప, మూర్తి, సత్తయ్య, ఆనంద్ కుమార్, తదితర కార్మికులు పాల్గొన్నారు.
అంబర్‌పేట : కేంద్రం ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని సీపీఐ (ఎం) నాయకులు ఎం. మహేందర్ అన్నారు. గురువారం తిలక్ నగర్ పెట్రోల్ బంకు దగ్గర పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సుబ్బారావు, మూర్తి మోహన్, నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీ నగర్: ఎల్బీనగర్లోని భారత్ పెట్రోల్ బంక్ ముందు గురువారం సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధరల పెంపునకు నిరసనగా ధర్నా నిర్వహించారు. మోడీ డౌన్ డౌన్, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నినదించారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందోజు రవీంద్రచారి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కీసర నర్సిరెడ్డి, సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు, సీపీఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కె. చందు, హయత్‌నగర్ కార్యదర్శి సామిడి శేఖర్‌రెడ్డి, సీపీఐ(ఎం) ఎల్బీనగర్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య, సరూర్‌నగర్ కన్వీనర్ సీహెచ్ వెంకన్న, సీపీఐ(ఎం) నాయకులు భీమనపల్లి కనకయ్య, ఎం. వీరయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు అనసూయ, లింగంగౌడ్, రాములు, కట్టా శ్రీనివాస్, రాజు, నోముల సుదర్శన్‌రెడ్డి, సుధాకర్, సి.శ్రీనివాస్, సీహెచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.