Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫతుల్లాగూడలో 500 టన్నుల వ్యర్థాల రీసైక్లింగ్
- నిర్మాణ వ్యర్థాల రహిత నగరంగా గ్రేటర్ హైదరాబాద్
- నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
వ్యర్థ పదార్థాల నిర్వహణలో భాగంగా నాగోల్ సమీపంలోని ఫతుల్లాగూడలో రెండో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మరో ఘనతను సాధించింది. ఇప్పటికే జీడిమెట్లలో అత్యాధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన మొదటి భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్‌ను గతేడాది నవంబర్‌లో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభిం చారు. దక్షిణ భారత దేశంలోనే జీడిమెట్ల ప్లాంట్ అతి పెద్దది కాగా మొత్తం భారత దేశంలోనే ఐదవ పెద్ద ప్లాంట్. ఫతుల్లాగూడలో రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ చేసే ఆధునిక ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. దేశంలో న్యూఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, విశాఖపట్నం నగరాలతో పాటు సీ అండ్ డీ ప్లాంట్‌ను కలిగి ఉన్న ఐదో నగరంగా హైదరాబాద్ నిలిచింది. వెట్ ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ సీఅండ్‌డీ ప్లాంట్ నిర్వహణలో ఏవిధమైన దుమ్ము, ధూళీ బయటకు రాదు. తెలంగాణ రాష్ట్రం వ్యర్థపదార్థాల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా హైదరాబాద్ నగరంలోని రహదారుల వెంట ఎక్కడా కూడా భవన, నిర్మాణ వ్యర్థాలు కనిపించకూడదని, ఆ వ్యర్థాలను సేకరించి రీ-సైక్లింగ్ చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదేశించడంతో హైదరాబాద్ నగరం నాలుగు వైపులా సీ అండ్ డీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. తొలిదశలో జీడిమెట్ల, ఫతుల్లాగూడలో స్థల సేకరణ జరిపి ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్‌లో రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీ-సైక్లింగ్ చేయనున్నారు. ఈ రీసైక్లింగ్‌తో నిర్మాణ వ్యర్థ పదార్థాలలో 90 శాతానికి పైగా తిరిగి ఉపయోగపడేలా సన్న ఇసుక, దొడ్డు ఇసుక, కంకర, రాయి ఇలా వేర్వేరుగా వస్తాయి. నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌లో 80-20 సైజు కంకర 30 శాతం, ముడి ఇసుక 20 శాతం, ముతక ఇసుక 20 శాతం, దొడ్డు కంకర 25 శాతం వస్తాయి. ఈ వేరుచేసిన ఈ మెటీరియల్స్‌తో పేవర్ బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, ఫుట్‌పాత్ టైల్స్ వంటివి తయారు చేస్తారు. ఈ టైల్స్ బయట మార్కెట్లో దొరికే వాటికన్నా నాణ్యతతో పాటు ధర కూడా తక్కువగా ఉంటాయి. ఈ మెటీరియల్స్ ఫుట్‌పాత్, ఫ్లోరింగ్ నిర్మాణానికి ఉపయోగపడతాయి.
13.35లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
జీడిమెట్ల ప్లాంట్ ఇప్పటి వరకు 13.35 లక్షల మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించగా 2021 ఏప్రిల్ మాసం నుంచి నిర్వహణ ప్రారంభించిన ఫతుల్లాగూడ ప్లాంట్ ద్వారా 7.97 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించారు. 500ఏండ్లకుపైగా ఉన్న పురాతన నగరమైన హైదరాబాద్ నగరంలో రోజుకు దాదాపు రెండు వేలకుపైగా నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయి. ఈ వ్యర్థాలను అర్థరాత్రి సమయాలలో రోడ్ల వెంట, చెరువుల్లో అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. దీనిని కూడా నివారించేందుకు ఎక్కడైనా నిర్మాణ వ్యర్థాలు ఉంటే ఈ వ్యర్థాలను తరలించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. టన్ను వ్యర్థానికి రూ.342 చెల్లిస్తే ఇంటి వద్దకే వాహనం వచ్చి తీసుకెళ్లే ఏర్పాట్లను చేసింది. ఈ విధమైన సీఅండ్‌డీ ప్లాంట్లను నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది.