Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి పనులకు నిధుల కొరతలేదు
- మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ శ్వేతా మహంతి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఈవిషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన కేశవాపురం, నాగిశెట్టిపల్లి, మూడుచింతపల్లి, లింగాపూర్ తండా, లక్ష్మాపూర్ లలో జరుగుతున్న పనులు, అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం దత్తత తీసుకున్న ఐదు గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పనులను వేగవంతంగా చేయాలన్నారు. ఈవిషయంలో జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలతో సమన్వయం ఏర్పర్చుకోవాలని సూచించారు. కేశవాపూర్ వద్ద ప్రభుత్వం నిర్మించతలపెట్టిన రిజర్వాయర్‌కు అవసరమైన భూసేకరణ ఎంతవరకు వచ్చిందని, ఇంకా పూర్తి చేయట్లయితే వెంటనే పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, అలాగే నిధులకు ఏమాత్రం కొరతలేదని అధికారులకు వివరించారు. ఈసందర్భంగా జిల్లా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. కరోనా నేపథ్యంలో పనులు కొంత ఆలస్యంగా జరిగాయని వీటిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏమైనా పనులు పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని, ఈ విషయంలో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, పంచాయతీరాజ్ ఈఈ రాంమోహన్, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.