Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణ వ్యర్థాల తరలింపునకు టోల్ ఫ్రీ నెంబర్ 18001201159
- భవిష్యత్తులో ఇతర పట్టణాల్లో కూడా ప్లాంట్లు ఏర్పాటు చేస్తం
- ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
- ఫతుల్లాగూడలో నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను చెరువుల్లో, నాలాల్లో, కాలువల్లో వేసే పద్దతి పూర్తిగా బందుజేయాలని ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మాణ వ్యర్థాల తరలింపుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 18001201159కు ఫోన్ చేయాలని సూచించారు. నాగోల్‌లోని ఫతుల్లా గూడలో శుక్రవారం ఆయన భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 500ల టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తారని తెలిపారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బి.దయానంద్, పర్యాటక సంస్థ చైర్మెన్ శ్రీనివాస్ గుప్తా, డిప్యూటి మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, నాగోల్ కార్పొరేటర్ అరుణ యాదవ్, రాంకీ ఎన్విరో ఎండీ. గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఇప్పటికే జీడిమెట్లలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఫతుల్లాగూడలోనిది రెండోప్లాంట్ అని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో కూడా ఈ తరహా ప్లాంట్‌ను భవిష్యత్తులో ఏర్పాటు చేస్తామన్నారు.