Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యక్ష తరగతులు వాయిదా వేసిన రాష్ట్ర ప్రభుత్వం
- గతేడాదిలాగే ఈసారి కూడా పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు
- 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఆన్లైన్ బోధన
- బడులకు 50 శాతం హాజరు కానున్న ఉపాధ్యాయులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రత్యక్ష తరగతులకు సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బడుల్లో ప్రత్యక్ష తరగతులను జులై 1 నుంచి నిర్వహించాలని నిర్ణ యించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆన్లైన్ క్లాసులకు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈనెల 25నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు అవుతున్నారు. అలాగే జులై ఒకటో తేదీ నుంచి విద్యార్థులు బడులకు రావాల్సి ఉన్నది. కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడితో పాటు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గతేడాది తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష క్లాసుల స్థానంలో ఆన్లైన్ క్లాసులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు పాఠాలు సైతం బోధించింది. అయితే ఆన్‌లైన్‌తో పెద్దగా ప్రయోజనం లేదని గుర్తించింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గడంతో ఈ విద్యాసంవత్సరం బడుల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ఒకే చెప్పింది. ఆ మేరకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. కానీ కరోనా థర్డ్‌వేవ్ ముప్పు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన, హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సర్కారు ఆన్లైన్ బోధనకు మొగ్గుచూపింది. కొద్దిరోజుల పాటు ప్రత్యక్ష క్లాసులను వాయిదా వేయాలని నిర్ణయించింది. దీంతో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు ప్రారంభం కానున్నాయి. అలాగే 50శాతం టీచర్లు బడులకు హాజరవుతారు. మరో 50శాతం మరుసటి రోజు విధులకు హాజరు కానున్నారు. ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించాలని ఇప్పటికే ప్రభుత్వం విద్యాశాఖ అధికారులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జులై రెండో వారం నుంచి 6,7,8 9,10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించే అవకాశం ఉందని, మిగతా తరగతి విద్యార్థుల బోధనకు సంబంధించి త్వరలో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు.