Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారని జవహర్నగర్ రూపురేఖల
- లక్షల జనాభా, సవాలక్ష సమస్యలు
- ఊసేలేని అభివృద్ధి
- ఇరుకురోడ్లు, వెలగని వీధిలైట్లు
- రోడ్లపైనే చెత్త డంపింగ్
నవతెలంగాణ - జవహర్నగర్
లక్షల జనాభాతో నిండి ఉన్న జవహర్నగర్ గ్రామ పంచాయితీ సవాలక్ష సమస్యలతో సతమతమ వుతోంది. జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయితీగా పేరొందిన జవహర్నగర్ గ్రామాభివృద్ధిలో మాత్రం అందనంత దూరంలో ఉంది. గ్రామంలో ఎక్కువ శాతం నిరుపేదలే జీవిస్తున్నారు. ఎన్నికల సమయం లో వచ్చిన నాయకులు గ్రామానికి అది చేస్తాం..ఇది చేస్తాం..అని మాయమాటలు చెప్పి అమలులో మాత్రం ఆచరించడంలేదు. జవహర్నగర్ గ్రామం లో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడే జీవిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్కు సమీపంలోనే ఉండడంతో నగరంలో పనిచేసే చాలామంది వ్యాపారస్థులు, ఉద్యోగులు ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. పది సంవత్సరాల క్రితం రెండు వేల మంది ఉన్న ఈ గ్రామ పంచాయితీ ప్రస్తుతం రెండు లక్షలకు పైబడే జనాభా ఉన్నారు. జవహర్నగర్ గ్రామం మొత్తం ఆరు వేల ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ప్రజా ప్రతినిధుల పనితీరు అధికారుల వైఫల్యంతో గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జవహర్నగర్ గ్రామం జనాభా విస్తీర్ణంలో ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గ్రామానికి సరిపడ వనరులు సమకూర్చుకోకపోవడంతో గ్రామ పంచా యితీ ఘోరంగా విఫలమైందని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. 2004లో పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయన్న అభియోగం రావడం తో స్థానిక ప్రజలు పడ్డ ఎటువంటి పన్నుల వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో గత కొన్నేళ్లుగా గ్రామాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. 28 డివిజన్లుగా కార్పొరేషన్ ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా పేదలు మాత్రం అభివృద్ధికి నోచుకో వడం లేదు. ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్త చెదారంతో దర్శనమిస్తున్నాయి. కార్పొరేషన్ ఏర్పడిన తరువాత కూడా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. గుంతలు పడిన రోడ్లలో ఏవైనా ప్రమాదాలు జరిగితే అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. కనీసం మంచినీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.