Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత కుటుంబానికి రూ.30 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని యూనియన్
నాయకుల డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాణిగంజ్ డిపో 1 ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య నగరంలో సంచలనం రేపింది. అధికారుల వేధింపుల వల్లే డ్రైవర్ తిరుపతి రెడ్డి మంగళవారం డిపోవద్ద పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఉద్యోగులు నగరంలోని ఆర్టీసీ డిపోల ఎదట ధర్నాకు దిగారు. వేధింపులకు పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ వైస్ చైర్మెన్ హనుమంతు మాట్లాడుతూ... అధికారుల వేధింపులతో తిరుపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. వేధింపులకు పాల్పడిన అధికారులపైన తగిన చర్య తీసుకోవాలని, వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ. 30 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. చిన్న చిన్న కారణాలు చూపించి యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐదు నిమిషాలు లేట్ అయినా డ్యూటీ ఇవ్వకుండా రోజులతరబడి తిరిగే విధంగా ఆబ్సెంట్స్ వేసి జీతాల్లో కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు అధికంగా తీసుకురావాలని డీజిల్ మిగలాలంటే కేఎంపీఎల్ తీసుకురావాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. వివిధ డిపోల్లో ఇష్టమున్నట్లు పని కూడా చేయించుకుంటున్నారని తెలిపారు. ఏదో ఒకరకంగా సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఎంత కష్టపడి పనిచేసినా గుర్తించకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మెన్ కె.హనుమంతు ముదిరాజ్, కన్వీనర్ కమల్రెడ్డి, కో-కన్వీనర్ సుద్దాల సరేష్తోపాటు నరేందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.