Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్
- బన్సీలాల్ పేటలో 180 డబుల్
బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభం
నవతెలంగాణ-బేగంపేట్
పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ జీవైఆర్ కాంపౌండ్లో రూ. 15.57 కోట్ల వ్యయంతో నిర్మించిన 180 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్ హేమలత లతో కలిసి ప్రారంభించారు. ముందుగా కాలనీ ఆవరణలో నూతన ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి అలీ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు నామమాత్రపు ఆర్థిక సహాయంతో ఇరుకైన ఇండ్లను నిర్మించి ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన ప్రభుత్వమే ఖర్చు భరించి విశాలమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని వివరించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ ఇండ్లను లబ్ధిదారులకు అందరి సమక్షంలో లాటరీ పద్దతిలో పంపిణీ చేస్తామని వివరించారు. జీవైఆర్ కాంపౌండ్ పక్కనే నివసిస్తున్న నిరుపేద ముస్లీంలకు కూడా 5 నెలల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని సభలో ప్రకటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, ఆర్డీఓ వసంత కుమారి, తహసీల్దార్ జానకి, డీఎంసీ ముకుంద రెడ్డి, ఈఈ శివానంద్, హౌసింగ్ సీఈ కిషన్, ఈఈ వెంకటదాసు రెడ్డి, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, ఆకుల రూప, ఉప్పల తరుణి తదితరులు పాల్గొన్నారు.