Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న సీఎం దళిత సాధికారత పథకం నిధులు నేరుగా లబ్ధిదారులకు చెందాలని, ఉత్పాదక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మెన్ రామదాసప్ప నాయుడు అన్నారు. ముద్ర కోపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఎం దళిత సాధికారత-సద్వినియోగం అనే అంశంపై చర్చావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. దళితులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా ఇవ్వాలని, ఇందులో ఉత్పాదక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలని సూచించారు. ఈ చర్చ వేదిక అంశాలను ముఖ్యమంత్రికి వినతిపత్రం రూపంలో పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జి కోటయ్య, సంస్థ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పావని, హెచ్ఆర్ రవి, ఉమా, వెంకట్, భీముడు, ఉదరు తదితరులు పాల్గొన్నారు.