Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్
నవతెలంగాణ-నారాయణగూడ
80 వేల మంది పని చేస్తున్న డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను తమ అనుబంధ పారిశ్రామిక మిత్రులకు అప్పజెప్పడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఆర్డినెన్స్‌లతో ఉద్యమాలను ఆపలేరని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌బోస్ కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు. 2020 మార్చి నుంచి దేశంలోని ప్రజలు కరోనా మహమ్మారితో చనిపోతుంటే ప్రజలను పట్టించుకోకుండా ప్రభుత్వం 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరణ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 80 వేల మంది ఉద్యోగుల న్యాయమైన, దేశరక్షణ కోరే సమ్మెను పరిష్కరించడానికి చేతగాని కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన 30.06.21 నాడు ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఆ పరిశ్రమల్లో సమ్మెను నిషేధించడాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ప్రజాకంటక, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు చేస్తూ నిరసన తెలిపే హక్కును ఆర్డినెన్స్ ద్వారా హరించడం పాలకుల నియంతత్వానికి నిదర్శనమన్నారు. వెంటనే సమ్మెను నిషేధించే ఆర్డినెన్స్‌ను విరమించుకోవాలని, దేశ రక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ విధానానికి అంతం పలకాలని ఆయన డిమాండ్ చేశారు.