Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలరోజులపాటు వివిధ కార్యక్రమాలు
- పట్టణ ప్రగతి కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
వర్షాకాల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణకు నెలరోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి పాల్గొన్నారు. కాలనీ పార్కులో మొక్కలు నాటిన అనంతరం ఎంటమాలజి విభాగం ద్వారా నిర్వహించిన సీజనల్ వ్యాధుల నివారణ చైతన్య కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన జీవన ప్రమాణాలతో నివసించేందుకు జులై ఫస్టు నుంచి పది రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. 'మన ఇల్లు మాదిరిగానే పరిసరాలు పరిశుభ్రంగాను, పచ్చదనంతో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం' అన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలో భాగంగా హైదరాబాద్‌ను బిన్లెస్ సిటీగా మార్చామని, డస్ట్బిన్లను తొలగించినందున ప్రతిఒక్కరూ తమ ఇండ్లలోని చెత్తను స్వచ్ఛ ఆటోలకు విధిగా ఇవ్వాలని నగరవాసులకు మేయర్ విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున నీటి సంబంధమైన వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వీటి నివారణకు నెల రోజులపాటు నగరంలో విస్తతంగా అంటువ్యాధుల నివారణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఎంటమాలజి విభాగం ద్వారా దోమల నివారణ, యాంటి లార్వా స్ప్రేయింగ్, పోర్టబుల్ ఫాగింగ్ మిషన్ల ద్వారా ఫాగింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. దోమలను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న నీటి నిల్వలను తొలగించడం, యాంటి లార్వా కార్యక్రమాలతో పాటు నగరంలోని చెరువులు, కుంటలలో లార్వా నివారణ చర్యలు, ఆయిల్ బాల్స్ వేయడం వంటి కార్యక్రమాలను చేపట్మాన్నారు. నగరంలోని అన్ని నాలాల్లో పూడికతీత పనులు ముమ్మరంగా చేపట్టామన్నారు. నగరంలో పచ్చదనం పెంచేందుకు హరితహారం కింద కోటి మొక్కలను నాటాలనే లక్ష్యంగా నిర్ణయించగా దీనిలో భాగంగా అవెన్యూలు, మీడియన్లు, ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గుర్తించిన ప్రాంతాల్లో మల్టీలెవల్ ప్లాంటేషన్‌ను చేపడుతున్నట్లు వివరించారు. మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జోనల్‌కమిషనర్ ప్రావిణ్య, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, డిప్యూటీ కమిషనర్ సేవానాయక్ తదితరులు పాల్గొన్నారు.