Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనేక శస్త్ర చికిత్సల్లో గ్రాండ్ సక్సెస్
- ఆస్పత్రికి దక్కిన అరుదైన గౌరవం
- డాక్టర్ డే సందర్భంగా రికార్డు పత్రాల అందజేత
- అందరి కృషి ఫలితమేనన్న సూపరింటెండెంట్
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
వందేళ్ల చారిత్రాత్మక ఉస్మానియా ఆస్పత్రి మూడు ప్రపంచ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. డాక్టర్స్ డేను పురస్కరించుకొని గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ రికార్డుల భారత ప్రతినిధి లయన్ కె.వి రమణ రావు. దక్షిణ భారత ప్రతినిధి శ్రీవిద్య. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి రాజు తదితరులు ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.నాగేందర్‌కు భారత్ వరల్డ్ రికార్డ్స్, డాక్టర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ తదితర సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా లయన్ కె.వి రమణరావు మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి వందలాది అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించి, ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిందన్నారు. మత్తుమందు (అనస్తీషియా)ను పరిచయం చేసిన ఘనమైన చరిత్రగల ఉస్మానియా ఆస్పత్రి కరోనా సమయంలోనూ ఎంతో సమర్థవంతంగా వైద్య సేవలు అందించి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టిందన్నారు. నగరంలోని గాంధీ, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రులు కొవిడ్ ఆస్పత్రులుగా మారడంతో ఆయా ఆస్పత్రులకు వెళ్లే రోగుల అంతా ఉస్మానియాకే రావడంతో రోగుల రద్దీ. పని భారం పెరిగినా డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది ఒత్తిడికి గురికాకుండా ఎంతో ఓర్పుతో వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు.అత్యంత అరుదైన శస్త్ర చికిత్సల ను విజయవంతంగా నిర్వహించి ఎంతోమంది ప్రశంసలు వైద్యాధికారులు అందుకు ఉంటున్నారని చెప్పారు. ఎన్నో అరుదైన ఆపరేషన్లకు నిలయమైన ఉస్మానియా ఆస్పత్రి కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ (అవయవమార్పిడి) విజయవంతంగా నిర్వహించి రోగులకు పునర్జన్మనిచ్చిందన్నారు. ఇప్పటికే ఉస్మానియాలో ఏడు వందలకుపైగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు నిర్వహించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గతవారం రోజులుగా ఓల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఉస్మానియా ఆస్పత్రిపై, వివిధ అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం నిర్వహించి అనంతరం వందేళ్ల చరిత్ర. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలను పరిగణలోకి తీసుకొని వరల్డ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్‌తోపాటు డాక్టర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించినట్లు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ మాట్లాడుతూ... కరోనా కష్టకాలంలో ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది సమన్వయంతో, సమిష్టిగా అందించిన సేవలవల్లే ఉస్మానియాకు జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ఉస్మానియాకు ప్రపంచ రికార్డులకు సంబంధించిన పత్రాలు అందజేయడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, నాల్గవ తరగతి, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫలితమే ఈ ప్రపంచరికార్డు అన్నారు. ఆర్.ఎం.ఓ. డాక్టర్ శేషాద్రి, ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ సాయి శోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు, డాక్టర్ నరేందర్, డాక్టర్ అనురాధ, డాక్టర్ మాధవి, డాక్టర్ మాధురి, డాక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు