Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
- అలియాబాద్లో రైతువేదిక ప్రారంభం
- రైతులకు సాయిల్ కార్డులు అందజేత
నవతెలంగాణ-శామీర్పేట
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం శామీర్ పేట మండలం అలియాబాద్ చౌరస్తాలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి రైతువేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు దేశంలో ఎక్కడా ప్రవేశపెట్టని పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కరోనా విపత్కర సమయంలోనూ రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేశామన్నారు. రైతువేదికలను రైతుల కోసం నిర్మించారని, వారు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏ పంట వేస్తే బాగుంటుందనే వివరాలను చర్చించుకోవాలని సూచించారు. అనంతరం పలువురు రైతులను సన్మానించి వారికి సాయిల్ హెల్త్ కార్డులను అందజేశారు.
వెదజల్లే పద్దతి ద్వారా సాగు చేస్తే మంచి దిగుబడి
రైతులు పాత వ్యవసాయ పద్దతులను పక్కనబెట్టి వెదజల్లే పద్దతి ద్వారా సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుందని తద్వారా పంటలకు రోగాలు రావని నష్టాలు ఉండవని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈయాసంగిలో జిల్లావ్యాప్తంగా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, దీనికి సంబంధించి రైతుల ఖాతాల్లో ఒకటి రెండు రోజుల్లోనే డబ్బులు జమచేశామన్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి గ్రామంలోని రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి రేఖ మేరి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు నందారెడ్డి, జిల్లా కన్వీనర్ కృష్ణారెడ్డి, డీసీఎంసీ ఛైర్మెన్ మధుకర్ రెడ్డి, ఆర్డీవో రవి, శామీర్పేట ఎంపీపీ ఎల్లుబాయి, అలియాబాద్ సర్పంచ్ కుమార్ యాదవ్, శామీర్పేట సర్పంచ్ బాలమణి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.