Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పట్టణ ప్రగతిలో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా పలు కార్యక్రమాలు చేపట్టాలని జలమండలి అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరాలు అందజేశారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. జలమండలి పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ, పరిసర పురపాలికల్లో నాలాల క్లీనింగ్, పూడికతీత వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ల పూడికతీత, క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలను జీహెచ్ఎంసీ, పరిసర పురపాలికలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు. వర్షాకాల ప్రణాళికను అమలు చేయాలని, రోడ్లపై మ్యాన్ హోళ్లకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. తాజాగా నగరంలో 11 వేల మ్యాన్ హోళ్లను సరి చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. నగరంలో ప్రధాన రోడ్లుగా ఉన్న సుమారు వెయ్యి కిలోమీటర్ల పరిధిలో మ్యాన్ హోళ్ళ సమస్య రాకుండా చూడాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు సూచించారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. జలమండలితో పాటు జీహెచ్ఎంసీవద్ద ఉన్న మినీ జెట్టింగ్, భారీ జెట్టింగ్ మిషన్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటామని జలమండలి అధికారులు మంత్రి కేటీఆర్కు తెలిపారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.