Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూసుఫ్‌గూడలో అధికారుల నిర్వాకం
- కోర్టు స్టే ఆర్డర్‌నూ పట్టించుకోలేదు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం, వెంగల్రావునగర్ డివిజన్లోని, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్దగల 350 గజాల స్థలంలో గల రేకుల గదులను, ఇంటి యజమానికి నోటీసులు ఇవ్వకుండా జులై ఒకటో తారీకు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ రెవెన్యూ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసుల రక్షణలో అక్కడ నివసిస్తున్న పేదవారికి వారి సామానులు కూడా తీసుకునేందుకు అవకాశం ఇవ్వకుండా కూల్చివేశారు. గత 20 సంవత్సరాల నుంచి ఎలాంటి కిరాయి లేకుండా, ఇంటి యజమాని అయిన స్వర్ణలత అనుమతితో పేదవారు రేకుల గదులు వేసుకుని జీవిస్తున్నారు.1962లో సర్వే నెంబర్ 149/2, బ్లాక్-ఆర్, వార్డ్ -7 లో 350 గజాల స్థలాన్ని శేషగిరిరావు అనే వ్యక్తి ప్రసాదరావువద్ద కొనుగోలు చేశాడు. అతని వద్దనుండి 1981లో నాదెండ్ల సుబ్బారావు కొనుగోలు చేసి కాంపౌండ్‌వాల్ ఏర్పాటుచేసి, గేటు ఏర్పాటు చేసి తన వద్ద పనిచేస్తున్న కూలీలకు నాలుగు రేకుల గదులు ఏర్పాటు చేసి ఇచ్చి. వారిని అందులో ఉంచారు. అదేవిధంగా అన్ని రూములకు కరెంటు మీటర్లు ఇచ్చి, మున్సిపల్ అనుమతి కూడా ఇచ్చారు. అక్కడ ఉంటున్న వారికి డోర్ నెంబర్8-3-229/1/5/బి తో అందరికీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చారు. నాదెండ్ల సుబ్బారావు మరణించిన అనంతరం ఆయన భార్య స్వర్ణలత, ఆ భూమికి యజమానిగా ఉండి, 2017లో కలెక్టర్‌కు ఎమ్మార్వోకు, యుఎల్‌సికి అనుమతి ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నది. అయితే ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అధికారులు పెండింగ్‌లో ఉంచారు. అయితే 2018లో స్వర్ణలత వద్దనుండి స్థానికంగా ఉన్న నవీన్ యాదవ్ కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్కు, స్థలం కొనుగోలు చేసిన నవీన్ యాదవ్‌కు మధ్య ఐదేండ్లుగా రాజకీయ వైరుధ్యం ఉంది. ఎలాగైనా నవీన్ యాదవ్‌ను ఆర్థికంగా నష్టపరచాలని ఇన్ని సంవత్సరాలుగా ఆ స్థలం జోలికి రాని అధికారులు, గత నెల క్రితం ఖైరతాబాద్ రెవెన్యూ అధికారులు ఆ స్థలం వద్దకు వచ్చి, ఈ స్థలం ప్రభుత్వ భూమని, వెంటనే ఖాళీ చేయాలని నోటి మాటగా చెప్పి వెళ్లారు. ఎలాంటి నోటీసులు యజమానికిగాని, స్థలంలో ఉంటున్న వారికి గాని ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన స్థల యజమాని వారి లాయర్లను సంప్రదించి 11/06/ 2021న కోర్టును ఆశ్రయించగా స్థల యజమానికి అనుకూలంగా స్థలంలో ఉంటున్న వారికి ఎలాంటి నష్టం కలిగించవద్దని జూన్ 30 వరకు స్టే ఆర్డర్ ఇచ్చింది. తిరిగి జూన్ 28న స్టే ఆర్డర్‌ను జులై 16 వరకు పొడిగించారు. ఈ విషయం తెలియని రెవెన్యూ అధికారులు ఆర్డర్30తో ముగిసిందని, జులై ఒకటో తారీకు గురువారం జేసీబీతో, జూబ్లీహిల్స్ పోలీసుల అండదండలతో, ఉదయం 6 గంటలకు వచ్చి కూల్చివేశారు. కూల్చివేసిన ఇండ్లలో ఉన్న టీవీలు, బీరువాలు, వంటసామాన్లు పూర్తిగా ధ్వంసమై బాధితులు నష్టపోయారు. అనంతరం స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేసి వెళ్లిపోయారు. ఇంటి యజమానికి కూడా సమాచారం ఇవ్వకుండా, కూల్చివేతలు చేపట్టినందున వారు వెంటనే హైకోర్టును ఆశ్రయించగా, మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైకోర్టు న్యాయమూర్తులు ఆ స్థలములో నివాసం ఉన్నవారికి ఎలాంటి నష్టం కలిగించవద్దని కూల్చివేతలు చేపట్టకూడదని యజమానికి స్టే ఆర్డర్ ఇచ్చారు. అయితే అప్పటికే కూల్చివేసిన రెవెన్యూ అధికారులు పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంటి యజమాని నవీన్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అక్రమంగా కూల్చిన అధికారులపై నష్ట పరిహారం ఇప్పించాలని తిరిగి హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఈ కూల్చివేతలకు ఖైరతాబాద్ రెవెన్యూ డిప్యూటీ తహసీల్దారు భాస్కర్, ఆర్ఐలు షపాలి, సందీప్, రాములు, వీఆర్వోలు విజయుడు, విజరు కుమార్, ప్రొ.డి.టి,అశోక్, సర్వేయర్ జయ, జూబ్లీహిల్స్ పోలీస్ అధికారులు భారీగా పాల్గొన్నారు.