Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
చలో అడ్డగుడూరుకు వెళ్తున్న ఓయూ విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన ఓయు పోలీసులు తక్షణమే వారిని బేషరతుగా విడుదల చేయాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలంలో మరియమ్మ అనే దళిత మహిళ అడ్డగూడూరు పోలీస్టేషన్లో లాకప్ డెత్‌కు గురైన ఘటనకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చిన ఛలో అడ్డగూడూరు కార్యక్రమానికి బయలుదేరుతున్న నాయకులు వేల్పుల సంజరు, కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్‌ల అక్రమ అరెస్టుకు నిరసనగా మరియమ్మ కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని ఆదివారం ఓయూ న్యాయ కళాశాల ఆవరణలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పల్లెర్ల సుధాకర్ మాట్లాడుతూ. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ఈ ఏడు సంవత్సరాలలో దళితులపై ప్రధానంగా మహిళలపై హత్యలు, అత్యాచారాలకు గురవుతున్నారని కేసీఆర్ ప్రభుత్వం దళితులపై చూపుతున్న వివక్ష అని తెలిపారు మరియమ్మపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి లాకప్ డెత్ చేసిన పోలీసులను శిక్షించకుండా ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపుటకు బయల్దేరిన విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దళిత సామాజిక వర్గానికి చెందిన గ్యాదరి కిషోర్ (తుంగతుర్తి) ఈ ఘటనపై ఇప్పటివరకు స్పందించకపోవడం అంటే అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడవడమే, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ ప్రశ్నించే గొంతుకలపై నిరంకుశత్వ పోకడ అవలంబిస్తున్నాడని ఇది రాజ్యాంగ హక్కులను హరించడమేనని, తక్షణమే విద్యార్థి సంఘాల నాయకులను విడుదల చేసి మరియమ్మ లాకప్ డెత్‌కు పాల్పడిన పోలీసులపై కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్య కేసు నమోదు చేసి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిఎస్ఎఫ్ ఇంచార్జ్ పోమల అంబేద్కర్, బహుజన విద్యార్థి సంఘం విజరు భాస్కర్, ఎన్టివిఎస్ వెంకటేష్, ఎస్టీ విద్యార్థి సంఘ నాయకులు బాబు నాయక్ పాల్గొన్నారు.