Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది ట్యూషన్ ఫీజు మినహా మరేది
- వసూలు చేయొద్దని ప్రభుత్వ ఆదేశం
- సర్కారు నిబంధనలు తమకూ వర్తించవని ప్రయివేట్ స్కూల్ యాజమాన్యాల దబాయింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా సంక్షోభం వేళ ప్రయివేటు పాఠశాలల ఫీజు దోపిడీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2021-22 విద్యాసంవత్సరానికి పాఠశాల ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 75లో ఎలాంటి రుసుమును పెంచకూడదని స్పష్టం చేసింది. స్టేట్ బోర్డ్, సీబీఎస్ఈ, ఐసీఎస్ ఇతర అంతర్జాతీయ బోర్డులకు అనుబంధంగా ఉన్న అన్ని ప్రయివేటు అన్ఎయిడెడ్ గుర్తింపు పొందిన పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని, తదుపరి ఆర్డర్లు వచ్చేవరకు నెలవారీ ప్రాతిపదికన ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలంది. కాదని ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని ప్రభుత్వం కరాఖండిగా తేల్చి చెప్పింది. కానీ నగరంలోని ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఎక్కడ ఈ జీవోలను లెక్కచేయడం లేదు. ఆ జీవోలు తమకేమీ వర్తించవని యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు కరాఖండిగా చెప్తున్నాయి. ఫలితంగా చాలామంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరి ఫీజులు కట్టాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలామంది పేరెంట్స్ లోలోన మథనపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
ఫీజులు కట్టాలని మొబైళ్లకు మెసేజులు
కరోనా రెండో దశ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ బోధనకు పర్మిషన్ ఇవ్వడంతో జులై 1 నుంచి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో మే నెలలోనే కొత్త విద్యాసంవత్సరం మొదలైపోయింది. పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపించే ఏర్పాట్లు జరిగిపోయాయి. కరోనా మొదటి, రెండో దశ లాక్డౌన్ నేపథ్యంలో అడ్డగోలుగా ఫీజులు పెంచేసి..స్కూళ్లు తెరవకముందే మొదటి టర్మ్ ఫీజుతో పాత ఫీజు వెంటనే చెల్లించాలని మొబైల్ మెస్సెజ్‌లు పంపుతున్నాయి. ఇక కొత్త అడ్మిషన్ కోసమైతే ఏకంగా డోనేషన్, అడ్మిషన్, ఇతర ఫీజులు పేరిట మోత మోగిస్తున్నాయి..
ఆ స్కూళ్లపై కఠినంగా వ్యవహరించాలి..
ప్రయివేటు యాజమాన్యాల దోపీడీపై పేరెంట్స్ నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ స్పందించి.. జీవో నెంబర్ 46ను కొనసాగిస్తూ ఇటీవల జీవో నెంబర్ 75 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఫీజులు పెంచకూడదని, 2021-22 విద్యాసంవత్సరానికి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే.. అది కూడా నెలనెలా కట్టే వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది. కానీ ప్రయివేటు పాఠశాలలు మూడునెలలకోసారి ముందుగానే ఫీజులు కట్టించు కుంటున్నాయి. ఆన్లైన్ పాఠాలే చెబుతున్నా.. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇదిలావుంటే కొత్త అడ్మిషన్ల ఫీజు విషయంలో అడ్డు అదుపు లేకుండాపోయింది. ఇటీవల ఈసీఐఎల్‌లోని కాప్రాలో నివాసముండే సాయి అనే వ్యక్తి ఓ ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ప్రముఖ పేరున్న స్కూల్‌కి తమ పాప ఒకటో తరగతి అడ్మిషన్ కోసం వెళ్లారు. అక్కడి సిబ్బందిని కలువగా..ఒకటో తరగతికి ప్రవేశానికి డోనేషన్ రూ.35వేలు, అడ్మిషన్ ఫీజు 35 వేలు మొత్తం ఏడాదికి రూ. 70 వేలు ఫీజు అని చెప్పాగా షాక్‌కు గురయ్యారు. భౌతిక క్లాసులు లేవు.. ఆన్లైన్ క్లాసులకే ఇంత ఫీజు అని ప్రశ్నిస్తే.. ఇక్కడే అంతే అనే అన్సర్ రాగా. ప్రభుత్వం కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని చెప్పింది అంటే.. ఇక్కడ ఆ రూల్స్ వర్తించవు అని చెప్పడంతో అప్పు వేట మొదలుపెట్టాడు. బిడ్డ భవిష్యత్తు కోసం అప్పు చేసినైనా చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విధంగా ప్రయివేటు స్కూళ్లలో ఫీజు పేరిట దోపీడీ జరుగుతుండగా.. ప్రభుత్వ ఆదేశాలను ఇంత బహిరంగంగా ఉల్లంఘిస్తుంటే ఏమీ చేయాలని వాపోయాడు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి పర్యవేక్షణ పెంచాలనీ, ఇలాంటి యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరించాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.