Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ శ్వేతా మహంతి
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
పల్లెలు పచ్చగా ఉండాలంటే హరితహారంలో మొక్కలు నాటి, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులదే అని కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని రాజబొల్లారం, రాయిలాపూర్ గ్రామాలను ఆకస్మికంగా సందర్శించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎవెన్యూ ప్లాంటేషన్ పట్ల ప్రత్యేక దృష్టి సారించి, మొక్కలను కాపాడాలని అధికారులను ఆదేశించారు. రాజబొల్లారం గ్రామంలోని రైతులకు రైతుబంధు పథకంలో డబ్బులు వస్తున్నాయా రైతు బీమా సక్రమంగా వస్తుందా లేదానని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని ఆయా సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి ప్రజలు తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. రాయిలాపూర్ గ్రామంలోని నర్సరీ వద్ద మొక్కలను సర్పంచ్ మెట్టు నర్మదాగోపాల్ రెడ్డితో కలిసి పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామాలను పరిశీలించారు. హరితహారం విషయంలో ప్రజలను చైతన్యపరిచి వారి ఇండ్ల ముందు గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటాలని, అందుకు నర్సరీలో అవసరమైన మొక్కలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. గ్రామంలో ప్రతి రోజు మొక్కలు నాటేందుకు సిబ్బందితో ఎన్ని గుంతలు తీయిస్తున్నారనే వివరాలతోపాటు ఏ రోజు ఎన్ని మొక్కలు నాటారు అనే వివరాలను కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి, జడ్పీ సీఈఓ దేవ సహాయం, ఎంపీడీవో శశిరేఖ, రాజ బొల్లారం సర్పంచ్ బాయమ్మ రాములు, పంచాయతీ కార్యదర్శులు విజయ, ఎంపీటీసీలు మెట్టు అనుపమా శ్రీకాంత్ రెడ్డి, నాయకులు మెట్టు గోపాల్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గ్రామస్తులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.