Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలను సర్కార్ పట్టించుకోవడం లేదు
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య
- మల్కాజిగిరి సర్కిల్లోని పలు కాలనీల్లో సుడిగాలి పర్యటన
- ప్రజలతో మాట్లాడుతూ.. స్థానిక సమస్యలపై అధ్యయనం
నవతెలంగాణ-నేరెడ్మెట్
పేదలు నివసించే ప్రాంతాలను వెంటనే అభివృద్ధి చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మల్కాజిగిరి సర్కిల్, మౌలాలి డివిజన్లోని గాంధీనగర్, భరత్‌నగర్, షఫీనగర్, ఆర్టీసీ కాలనీ, పిల్లి నర్సింగ్‌రావు బస్తీలలో జిల్లా కార్యదర్శి సత్యం, కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి, మల్కాజిగిరి సర్కిల్ కార్యదర్శి కృపాసాగర్‌తో కలిసి పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లి నర్సింగ్‌రావు బస్తీలో ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ... పేదలు నివాసముండే ప్రాంతాల్లో అభివృద్ధి గురంచి సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ కార్పొరేటర్ ఉండడంతో వారి మధ్య రాజకీయ విభేదాలవల్ల ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. పింఛన్లు, రేషన్ కార్డులు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంతవరకు ఏమీ ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా పేదలను పట్టించుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మల్కాజ్గిరి సర్కిల్ కమిటీ సభ్యులు మంగ, నరసయ్య, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.