Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
- జిల్లాకు 89 శాతం చేరినా..
- స్టూడెంట్స్ చేతికి రాలే..
- జులై 1నుంచి ప్రారంభమైన ఆన్లైన్ క్లాసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా రెండో దశ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి సైతం విద్యాశాఖ ఆన్లైన్ బోధనకు శ్రీకారం చుట్టింది. తొలుత ప్రత్యక్ష తరగతులకు సర్కారు మొగ్గుచూపినప్పటికీ కరోనా సెకండ్ వేవ్‌పై నిపుణుల హెచ్చరికలు, తల్లిదండ్రుల ఆందోళనతో ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో జులై 1 నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు టీ-శాట్, దూరదర్శన్ ద్వారా క్లాసులు వింటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఉపాధ్యాయులు చెప్పే పాఠం అర్థం కావాలన్నా.. తిరిగి ఆ పాఠం చదువుకోవాలన్నా.. విద్యార్థుల చేతుల్లో పాఠ్య పుస్తకం ఉండాలి. కానీ ఆన్లైన్ తరగతులు ప్రారంభమై ఆరు రోజులు కావొస్తున్న ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. సాధారణంగా ఇప్పటికే పుస్తకాల సరఫరా, పంపిణీ జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా రవాణా సమస్య ఆటంకంగా మారిందని, జిల్లా గోదాముకు ఇప్పటికే 89శాతం పుస్తకాలు చేరగా.. ఆరు మండలాలకు పుస్తకాలు చేరవేశామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థులు పుస్తకాలు లేకుండా ఆన్లైన్ క్లాసులు వినడంలో తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్టు చెబుతున్నారు.
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 948 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 1.50 లక్షల మంది చదువుతున్నారు. వీరికిగాను 9.70లక్షల పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు 89శాతం పుస్తకాలు జిల్లా గోదాముకు వచ్చాయి. ఇక్కడి నుంచి మండల పాయింట్లకు 2.70 లక్షల పుస్తకాలు చేరవేశారు. అక్కడి నుంచి స్కూల్ పాయింట్లకు 1.15వేల పుస్తకాలు చేరవేయగా.. సుమారు 1200 పుస్తకాలు మాత్రమే విద్యార్థుల చేతికి అందాయి. ఇక మండలాల వారిగా చూస్తే ఖైరతాబాద్ 1,2, షేక్‌పేట్, సైదాబాద్ 1,2, అమీర్‌పేట్ మండలాకు పుస్తకాల సరఫరా పూర్తికాగా.. మరో 12 మండలాకు పంపించాల్సిన పాఠ్యపుస్తకాలను వారం రోజుల్లో పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా అధికారులు వివరిస్తున్నారు.
పుస్తకాల కోసం ఎదురుచూపులు..!
ఇదిలావుంటే ప్రతి యేటా విద్యాసంవత్సరం ప్రారంభంలో జిల్లాకు పుస్తకాలు వచ్చేవి. పాఠశాల పున:ప్రారంభం నాటికి విద్యార్థుల చేతికి అందేవి. అయితే గతేడాది కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది జులై 1 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాశాఖ అధికారులు సైతం 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగమయ్యారు. కానీ ప్రత్యక్ష బోధన నిర్వహిస్తే మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉండొచ్చునన్న వైద్యులు, నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో సర్కారు ఆన్లైన్ బోధన వైపే మొగ్గుచూపింది. ఈ క్రమంలో జిల్లాకు పుస్తకాల సరఫరా చేస్తోంది. అయితే పాఠశాలలు ప్రారంభమై ఆరు రోజులు గడుస్తున్న జిల్లాకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు చేరలేదు. దీంతో ఆన్లైన్ విధానంలో టీశాట్, దూరదర్శన్, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో ఆయా తరగతులకు చెందిన విద్యార్థులు క్లాసులు వింటున్నారు. అయితే గతంలో వారికి ఏమైనా సందేహాలు వస్తే పుస్తకాల్లో చూసుకునేవారు. కానీ ఇప్పుడు విద్యార్థులు చేతిలో పుస్తకాలు లేకపోవడం మూలంగా.. పాఠ్య పుస్తకాల ఎప్పుడు ఇస్తారోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.