Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్,
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- మహంకాళి ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష
నవతెలంగాణ-బేగంపేట్
ఈనెల 25న జరిగే మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం సికింద్రాబాద్లోని శ్రీమహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల ఉత్సవాలను ఈఏడాది ఘనంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. 25న అమ్మవారి బోనాలు, 26న రంగం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే సంస్థల సభ్యులకు ప్రత్యేక ఫొటో గుర్తింపు కార్డులను అందజేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బోనాలు నిర్వహించే వివిధ ఆలయాలకు ఈనెల 19న (సికింద్రాబాద్ పరిధి), ఆగస్టు 1న(హైదరాబాద్ పరిధి) ప్రభుత్వ ఆర్థిక సహాయం చెక్కులను అందజేస్తామని వివరించారు. దీని కోసం ఆయా ఆలయాల కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యేలకు లేదా దేవాదాయ శాఖ అధికారులకు తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ప్రజలు కరోనా నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. అనంతరం పాలకమండలి ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, ఈఈ శివానంద్, మహంకాళి సీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ వినోద్, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, జీఎం రమణారెడ్డి, ఎస్ఈలు పద్మనాభరావు, రవికుమార్, ఈఈ రవీంద్ర మోహన్, ఆర్టీసీ ఆర్ఎం యుగేందర్, కార్పొరేటర్లు మహేశ్వరి, సుచిత్ర శ్రీకాంత్, దీపిక, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.