Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లింగాపూర్, పూడూరులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
- నిర్లక్ష్యం చేశారంటూ లింగాపూర్
- పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసు
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
పల్లె, పట్టణ ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి హెచ్చరించారు. మేడ్చల్ మండలంలోని లింగాపూర్, పూడూరు గ్రామాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడి వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను ప్రత్యేకంగా దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోనూ పచ్చదనాన్ని పెంచి భావితరాలకు బంగారు భవిష్యత్తును కల్పించడానికి ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంచడానికి తమ వంతు కృషి చేయాలని, ప్రజలకు, అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు. లింగాపూర్, పూడూర్ గ్రామాల్లో జరుగుతున్న పనుల వివరాలను, గ్రామాలలో పవర్ డే సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారని ఆయా గ్రామాల సర్పంచులను అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామాల్లో నాటిన మొక్కలను పరిశీలించారు. వాటి సంరక్షణకు పలు సూచనలు చేశారు. పల్లె ప్రగతి లక్ష్యం నెరవేరేలా పనులను వేగవంతం చేయాలన్నారు. పల్లెలు బాగుంటేనే ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. పల్లె ప్రగతి కేవలం పది రోజులకు మాత్రమే కాదని, అది నిరంతరం జరిగే కార్యక్రమమని అన్నారు. పూడూర్ గ్రామ పంచాయతీలోని నర్సరీని సందర్శించిన కలెక్టర్ ఇక్కడి ప్లాంటేషన్‌లో తీసుకుంటున్న జాగ్రత్తలు తెలుసుకున్నారు. ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారని సర్పంచ్ బాబు యాదవ్‌ను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు గ్రామాలలో ఎక్కడ ఖాళీజాగా ఉంటే అక్కడ మొక్కలు పెంచాలన్నారు.
పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసు
పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేశారంటూ.. మేడ్చల్ మండలంలోని లింగాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి శాంతిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యాంసన్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో రమణ మూర్తి, ఎంపీడీవో శశిరేఖ, మండల పంచాయతీ అధికారి వినూత్న, సర్పంచులు బైరి లక్ష్మీ సంజీవయ్య, ఈటబోయిన బాబు యాదవ్, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.