Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నమెంట్ ఆదేశాలు పట్టించుకోని ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యలు
- ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలన్న ఆదేశాలు బేఖాతర్
- అవస్థలు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
- ప్రయివేటు పాఠశాలలను హెచ్చరించని డీఈవో
నవతెలంగాణ-బేగంపేట్
ప్రభుత్వ ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే కానీ, ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం బేఖాతర్ చేస్తున్నాయి. ఆన్లైన్ క్లాసుల పేరుతో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న స్టూడెంట్లకు క్లాసులు వినకుండా చేస్తున్నాయి. కరోనా ప్రభావంతో ఆర్థికంగా చికితికిపోయి పూట గడవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ఉన్న చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విధమైన ప్రయివేటు స్కూళ్ల వైఖరితో అవస్థలు పడుతున్నారు. తమ పిల్లను ఎలా చదువించుకోవాలని కుమిలిపోతున్నారు. సర్కారు ఏదో ఒకటి చేయాలని కోరుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆన్లైన్ క్లాసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు పునర్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ విద్యా వ్యాపారానికి అలవాటు పడిన ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యాలు తమ బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. పిల్లల తల్లిదండ్రులను ఆన్లైన్ క్లాసులకు ఫీజులు చెల్లించాలని, చెల్లించకపోతే ఉత్తీర్ణత ఉండదని, లాక్డౌన్ టైమ్‌లో ప్రభుత్వం చేసిన ప్రమోట్ కూడా వర్తించదని బ్లాక్మెయిల్ చేస్తున్నాయని కొందరు పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజులు చెల్లించకుంటే క్లాసులు కట్
ప్రయివేట్ విద్యా సంస్థల్లో ఎలాంటి ఫీజులూ పెంచవద్దని ప్రభుత్వం గతేడాది జీవో నంబర్లో జీవో నెంబర్ 48 విడుదలచేసింది. అవే నిబంధనలు ఈసారి కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. అందుకోసం జీవో నెంబర్ 75ను విడుదల చేసింది. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులను మాత్రమే వెసులుబాటు కల్పిస్తూ నెలవారీగా వసూలు చేయాలని సర్కారు ఆదేశించింది. కానీ ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇది పట్టించుకోవడం లేదు. సికింద్రాబాద్ పరిధిలో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో అయితే ప్రయివేటు పాఠశాలలు మరీ రెచ్చిపోతున్నాయని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి వేలాది ఫీజులు తమ పిల్లల చదువులకోసం ఎక్కడి నుంచి తెచ్చి చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసుల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేల నుంచి 40 వేల మధ్య డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లవాడికి ఎల్కేజీ ఫీజును త్రివేణి స్కూల్ యాజమాన్యం రూ. 32 వేలు అడుగుతోందని కుత్బుల్లాపూర్‌కు చెందిన విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అడినమేరకు ఫీజులు చెల్లించకుంటే ఆన్లైన్ క్లాసులు కట్ చేస్తున్నారని సికింద్రాబాద్‌కు చెందిన విద్యార్థి తల్లిదండ్రులు తమ గోడు చెప్పుకున్నారు. ఫీజుల దోపిడీని అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో గతంలో మూడు విడతల్లో ఫీజులు వసూళ్లు చేయగా సారి రెండు విడతల్లోనే మొత్తం కట్టేయాలని ఆదేశాలు ఇచ్చి ఫీజులు చెల్లించని వారికి మాత్రమే ఆన్లైన్ లింకులు పంపుతున్నారని, మిగతా వారికి కట్ చేస్తున్నారని పేరెంట్స్ అంటున్నారు. మారేడుపల్లిలోని ఓ ప్రముఖ పాఠశాలలో జూన్‌లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించారు. ఫీజులు కట్టిన వారికే తరగతులకు హాజరయ్యేలా చూశారు. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. డీఈవో నుంచి ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యాలకు ప్రభుత్వ జీవో అమలు చేయాలని కనీసం నోటీసుకూడా వెళ్లడం లేదని, ప్రయివేటు యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.