Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగంలోకి సీపీ.. జల్లెడ పట్టిన పోలీసులు
- చిన్నారిపై లైంగిక దాడి కేసులో కొనసాగుతున్న విచారణ
- దాదాపు 600 మంది పోలీసులతో గాలింపు
- మరో బాలిక కిడ్నాప్‌కు యత్నించగా అడ్డుకున్న స్థానికులు
నవతెలంగాణ-సిటీబ్యూరో/జవహర్‌నగర్
నగరంలోని దమ్మాయిగూడలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వారం రోజులు గడుస్తున్నా నిందితుని ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం సీపీ మహేష్‌భగవత్ స్వయంగా రంగంలోకి దిగారు. అత్యంత పాశవికంగా లైంగిక దాడికి యత్నించిన గుర్తు తెలియని దుండగుల కోసం తీవ్రంగా గాలించారు. దమ్మాయిగూడ పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టారు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
నిందితుల కోసం ఐదు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆరు ప్రత్యేక బృందాలతోపాటు దాదాపు 600 మంది పోలీసులతో ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. దమ్మాయిగూడ ప్రగతినగర్తోపాటు సమీప అటవీ ప్రాంతాల్లో అనువణువూ జల్లెడపట్టారు. డీసీపీ రక్షిత నేతృత్వంలో జవహర్‌నగర్ సీఐ బిక్షపతిరావు, కీసర సీఐ నరేందర్‌గౌడ్‌తోపాటు లా అండ్ ఆర్డర్, క్రైమ్ బ్రాంచ్, ఎస్వోటీ, ఐటీ సెల్, సీసీఎస్ పోలీసులు తనిఖీలను నిర్వహించారు. సమీపంలోని సీసీ టీవీపుటేజీలను పరిశీలించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. బాధిత చిన్నారి నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో నిలోఫర్ ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్యే సీతక్క చిన్నారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కామాందులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మరో చిన్నారి కిడ్నాప్‌కు యత్నం
నాలుగేండ్ల చిన్నారి కిడ్నాప్ లైంగిక దాడి సంఘటనలో పోలీసులు అనువణువు గాలిస్తున్న సమయంలోనే దుండగుడు మరో సంఘటనకు యత్నించడం సంచలనం రేపింది. ప్రగతినగర్‌లో ఎరుపు రంగు టీషర్టు, ముఖానికి నల్ల రంగు మాస్క్ ధరించిన ఓ అనుమానిత వ్యక్తి అక్కడే ఉన్న కిరాణ దుకాణంలో సిగరెట్ కొనుగోలు చేశాడు. అనంతరం అక్కడే ఆడుకుంటున్న చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు అడ్డుకుని నిలదీయడంతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమానితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.