Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండలంలోని ఎర్రగట్టుగుట్ట క్రాసురోడ్డులోని పెంబర్తి శివారు వ్యవసాయ బావిలో యువకుడి అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనియాంశమైంది. స్థానికులు, ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు కథనం ప్రకారం....గ్రేటర్ 55వ డివిజన్ పరిధి రామారానికి చెందిన తోట అశోక్, చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు హసన్‌పర్తి మండలం పెంబర్తి శివారులో గల వ్యవసాయ భూమిలో గేదెలను పెంచుకుంటూ పాలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునేవారు. తన ఇద్దరు కుమారులు కూడా గేదెల నుంచి సేకరించిన పాలను నగరంలో విక్రయిస్తూ తల్లిదండ్రులకు సాయంగా ఉండేవారు. ఈ క్రమంలోనే చిన్న కుమారుడు తోట రాకేష్ తన సోదరుడితో కలిసి పెంబర్తి శివారులోని వ్యవసాయ భూమి వద్దకు వచ్చారు. గేదెల నుంచి సేకరించిన పాలను నగరంలో అమ్ముకొని వచ్చేందుకు ఇద్దరి మద్య వాగ్వాదం జరిగినట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోదరుడు పాలను నగరంలోకి తీసుకెళ్లి అమ్మేందుకు రావడంతో రాకేష్ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతుండగా కుటుంబ సభ్యులు మాత్రం మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాకేష్ మృతి అనుమానాస్పదంగా మారడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సంఘటన స్థలాన్ని ఎస్సై రవీందర్, డిజాస్టర్ రెస్పాండ్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మృతదేహాన్ని బావిలో నుంచి వెతికి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు వెల్లడించారు.