Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా 12న నిరసనలు డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేంధర్ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పోలీసులు వత్తాసు పలికితే రాబోయే కాంగ్రేస్ ప్రభుత్వంలో వడ్డీతో సహా తీర్చుకోవాల్సి వస్తుందని డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్అండ్బీ గెస్టు హౌజ్‌లో ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యేడేండ్లలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను అడ్డుఅదుపు లేకుండా పెంచేసి ప్రజలపై భారం మోపిందన్నారు. 60 యేండ్లలో కాంగ్రేస్ ప్రభుత్వం 60 రూపాయలను దాటనివ్వలేదని, అదే బీజేపీ ప్రభుత్వం రూ.100పైగా పెంచేసిందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీకి మద్దతు పలికిన టీఆర్ఎస్ ప్రభుత్వం ధరలపై ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి టీఆర్ఎస్ అనుబంధ పార్టీగా మారిందనీ, ఢిల్లీమే దోస్త్..గల్లిమే లడాయి అంటూ ఈ రెండు పార్టీలు ప్రజలను మోసగిస్తున్నాయని విమర్శించారు. డబ్బు, పోలీసు ఉంటే ఏదైనా సాధిస్తామనీ, ప్రజలు ఏమనుకుంటే మాకేంటి అన్న తీరులో పాలన సాగిస్తున్నాయన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వత్తాసు పలికి కాంగ్రేస్ కార్యకర్తలకు అడ్డం పడితే ఇకపై ఊర్కేనే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిరసనలు తెల్పుతుంటే ముందే హౌజ్ అరెస్టులను చేసి నిర్భంధిచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కొందరు పోలీసు అధికారులు తమ తీరు మార్చుకోకపోతే, రాబోయే కాంగ్రేస్ ప్రభుత్వంలో వదిలిపెట్టేదిలేదనీ, వడ్డీతో సహా తీర్చుకుంటామని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రతి కాంగ్రేస్ కార్యకర్తకు అండగా ఉంటామని వారి కుటుంబాలకు మనోధైర్యంగా నిలుస్తామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఈ నెల 12న జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలకు ప్రతి ఊరి నుంచి ఐదుగురు సైకిల్‌పై హాజరై జయప్రదం చేయాలన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నిరసన గిర్నిబావి నుంచి నర్సంపేట వరకు సాగుతుందని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రేస్ నాయకులు తక్కెళ్లపెల్లి రవీందర్రావు, సొంతిరెడ్డి రంజిత్ రెడ్డి, పెండెం రామానంద్, చిట్యాల తిరుపతిరెడ్డి, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ చౌరస్తా : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 12న కాజీపేట నుంచి హన్మకొండ వరకు ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టనున్నట్టు డీసీసీ వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజురోజుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు శృతిమించుతున్నాయన్నారు. ఏడేండ్ల పాలనలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక సార్లు చమురు ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంపును నిరసిస్తూ పోరాటాలు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 12న ఎడ్లబండ్లతో, సైకిళ్లలతో ర్యాలీ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం 16న చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్, పీసీసీ సబ్యులు బత్తిని శ్రీనివాస్‌రావు, కార్పొ రేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఆయుబ్, ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకష్ణ, గ్రేటర్ వరంగల్ మైనారిటీ సెల్ చైర్మన్ మీర్జా అజీజుల్ల బేగ్, గ్రేటర్ వరంగల్ మహిళా కాంగ్రెస్ చైర్మన్ బంక సరళ పాల్గొన్నారు.