Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సదస్సులో వక్తలు
నవతెలంగాణ-రాంనగర్
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి అమలు చట్టం తీరుపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జి. నరసింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఇతర కులాలకు ఉన్న అంతరాలను తొలగించేందుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి, ఎటువంటి మళ్లింపులు లేకుండా దళితుల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలన్నారు. సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, వాటిని ఖర్చు చేసేందుకు ప్రత్యేక చట్టం ఏర్పాటైందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టంలో ఎస్సీ, ఎస్టీలకు ఇతర కులాలకు ఉన్నా అంతరాలను అధ్యయనం చేయకుండానే బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారని, దీనివల్ల ఎస్సీ, ఎస్టీ లకు నేరుగా ప్రయోజనం కలిగే పథకాలు కాకుండా సంబంధంలేని రంగాలకు కేటాయింపులు, ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. జీవో నెంబర్ 35 ద్వారా స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేసి నిర్ణీత సమయానికి కమిషనర్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా అది జరగడం లేదన్నారు. జిల్లా స్థాయిలో విజిలెన్స్ కమిటీల ఏర్పాటు, సమీక్షలు చేయడం లేదన్నారు. ఈ చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి కేటాయించిన నిధులు ఆ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయలేకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆ నిధులను సర్దుబాటు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు కానీ నేటికీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బి. నరసింహులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి సురుపంగ శివలింగం, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రామ్ ప్రసాద్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ నాయక్, దళిత బహుజన జాతీయ కార్యదర్శి శంకర్, యాక్షన్ ఎయిడ్ రీజినల్ మేనేజర్ ఆంజనేయులు కె. స్వరూప, కల్పన, అమత, నవీన్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.