Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాహ్నవి విద్యా సంస్థల చైర్మెన్ పరమేశ్వర్ సహకారంతో శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ క్యాంప్‌ను ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ విశృంఖల వ్యాప్తితో ప్రపంచం స్తంభించిపోయిందని, దానికి యూనివర్సిటీలు కూడా తల్లడిల్లుతున్నాయన్నారు. కోవిడ్ నియంత్రణ కోసం విధిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీలోని ప్రతి వ్యక్తికి ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ఎన్ఎస్ఎస్ వారు చేస్తున్న ఈ ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియ అభినందనీయమని కొనియాడారు. డా. రాములు ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ అనేక కొత్త రూపాల్లో తన సేవలు అందిస్తుందని, మరింత వేగంతో పనిచేయాలని ఆశాభావంవ్యక్తం చేశారు. అనంతరం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం. రాములు మాట్లాడుతూ. సేవల్లో ఓయూ ఎన్ఎస్ఎస్ ముందున్నదన్నారు. ఈ ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియకు సహకరించిన వీసీ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ చింత గణేష్, జాహ్నవి విద్యాసంస్థల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. యూనివర్సిటీ అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధక విద్యార్థులు తదితరులు 278 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ రెడ్యా నాయక్, డీన్ రాజేందర్ నాయక్, డా.అనుపమా పాల్గొన్నారు.