Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాట్సాప్ ద్వారా ప్రశ్నావళి
- 3నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష
- 'ఇంటింటా చదువుల పంట' ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా కారణంగా ఏడాదిన్నరగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆన్లైన్ క్లాసులను ప్రారంభించింది. గతేడాదిలాగే ఈ విద్యసంవత్సరం కూడా బడులు పున:ప్రారంభమైనప్పటికీ 3 నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్ ద్వారానే విద్యాబోధన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు విద్యాశాఖ ఈనెల 1 నుంచి 'ఇంటింటా చదువుల పంట' పేరిట వినూత్న కార్యమ్రానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థులకు వాట్సాప్ ఆధారంగా ప్రాక్టిస్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు ఏ మేరకు పాఠాలు అర్థమయ్యాయో.. తమ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు వాట్సాప్ ద్వారా ప్రశ్నావళికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన విద్యార్థులు ఏయే తప్పులు చేశారో పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియో పంపుతారు. దీంతో విద్యార్థులు ఆ పాఠ్యంశంపై పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది..
85955 24405 నమోదు ఇలా..
విద్యార్థులు పై నంబర్‌ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాట్సాప్ నందు నమస్తే లేదా హాలో అని టైప్ చేసి మెస్సేజ్ చేయాలి. ఆ తర్వాత జిల్లా, మండలం, తరగతి వంటి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేయాలి. ఆయా సూచనల ఆధారంగా ప్రతి వారం ఇచ్చే ప్రశ్నలు, మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు పూర్తి చేస్తూ పోతే ఆ తర్వాత కీ పేపర్ కూడా వస్తుంది. తద్వారా విద్యార్థి తన స్థాయిని తెలుసుకోవచ్చు. అందులో తక్కువ మార్కులు సాధించినట్లయితే.. సదరు విద్యార్థి ఏ అంశాలలో వీక్‌గా ఉన్నారో.. ఆ అంశాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలను కూడా వెంటనే పంపుతారు. ఆ వీడియోలను చూసిన తర్వాత ఆ విషయం పట్ల అవగాహన పెంచుకునే వీలుంది. 1 నుంచి 10 తరగతుల వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో.. రెండింట్లోనూ ఈ కార్యక్రమం అందుబాటులో ఉంది. అలాగే ఇది విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏ వారానికి ఆ వారం డిజిటల్ తరగతులు వీక్షించిన విద్యార్థులు ఆ వారానికి సంబంధించిన ప్రశ్నలను సాధించడానికి ఇది చాలా బాగా తోడ్పడుతుంది. ఉపాధ్యాయులు అందరూ తమ విద్యార్థులను రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.
విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం..
'ఇంటింటా చదువుల పంట' కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకూ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధ్యాయులు అందరూ తమ విద్యార్థులను రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలి..
-ఆర్.రోహిణి, డీఈవో, హైదరాబాద్