Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ఫాదర్ స్టాన్ స్వామి అని క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు ఎస్.జె సెల్వ గల్లేలి, పబ్లిక్ రిలేషన్ ఇన్ఛార్జ్ దీపక్ జాన్, కో ఆర్డినేటర్ జేమ్స్ సిల్వెస్టర్ కొనియాడారు. పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం లిబర్టీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట అసోసియేషన్ నాయకులు ఇటీవల నవీ ముంబైలోని తలోజా జైలులో మరణించిన ఫాదర్ స్టాన్ స్వామి అస్థికలకు పూలమాలలతో నివాళి అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 84 ఏళ్ల స్టాన్‌స్వామి దేశంలో జరిగే అవినీతి, ల్యాండ్ మాఫియా, ఆదివాసీల హక్కుల కోసం నిరంతర పోరాటాలు చేశారని గుర్తు చేశారు. జార్ఖండ్‌లో ఆదివాసీల మధ్య తన జీవితాన్ని గడిపారన్నారు. భీమా కోరేగావ్ కుట్ర కేసులో అరెస్ట్ చేసి అన్యాయంగా జైల్లో పెట్టి ఆయన చావుకు కారణం అయ్యారని ఆరోపించారు. స్టాన్ స్వామి మరణానికి దర్యాప్తు సంస్థలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. స్టాన్ స్వామి అస్థికలు బెంగుళూరు నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చాయని, సికింద్రాబాద్‌లోని సెంట్ మేరీస్ చర్చిలో ఆయన అస్థికలు రెండు రోజుల పాటు క్రైస్తవుల సందర్శనార్థం ఉంచనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, మెథడిస్ట్, బాపిస్ట్, లుతెరిన్, ఆర్ధోడాక్స్, ఇండిపెండెంట్ చర్చల ప్రతినిధులు ఎస్.జె బోస్కో, సుధాకర్, ఎస్.జె సెల్విన్ తదితరులు పాల్గొన్నారు.