Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు,
- నీరు నిలవడంతో తరచూ ప్రమాదాలు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జలమండలి అధికారుల నిర్లక్ష్యం కారణంగా విలువైన తాగునీరు నెలల తరబడి లీకేజీ అవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శ్రీనివాస్‌నగర్ బస్‌స్టాప్ నుంచి గాజులరామారం మెయిన్‌రోడ్డు, ఉమాదేవినగర్ శివాలయం పరిధిలో కొద్ది నెలలుగా రోడ్డు పూర్తిగా పాడైపొయింది. గుంతల మయంగా మారి ఆధ్వాన్నంగా తయారైంది. నిత్యం వందలాది వాహనాలు ఆ రోడ్డు గుండానే సంచరిస్తుంటాయి. ప్రధాన రోడ్డులో డ్రయినేజీ పైపులైన్లు వేస్తుండడంతో కాంట్రాక్టర్లు భారీగా గుంతలు తవ్వి అసంపూర్తిగా వదిలేయడంతో నిత్యం ప్రమాదాలకు నెలవుగా మారాయి. రాత్రి వేళల్లో అనేక సార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయని, గుంతలో నీరు నిలిచి పోవడంతో ఈ సీజన్లో దోమలు అధికంగా వ్యాప్తి చెంది విష జ్వరాలు ప్రభలుతున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లప్పుడు దండాలు పెట్టి, గెలిచిన తరువాత నాయకులు మొహం చాటేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జలమండలి అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా జలమండలి అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని స్థానికులు హెచ్చరించారు.