Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మౌలిక సౌకర్యాలకు ఎస్ఐఎస్ సర్వే
- స్కూళ్ల నుంచి వచ్చే రిపోర్టు ఆధారంగా నిధుల కేటాయింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లోని సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు ఉండవు. సరిపడా గదులు ఉన్న చోట లీకేజీ సమస్యలు, గోడలు పెచ్చులూడిపోవడం వంటివి కనిపిస్తుంటాయి. చాలా పాఠశాలల్లో ఈ సమస్యలు ఉన్నాయి. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడానికి ఏండ్లు పట్టాల్సిందే. ఈ సమస్యల నడుమ ఏటా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడం.. వసతుల కల్పనపై జిల్లా విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్దం చేసి పంపించడం జరుగుతోంది. కానీ ఆశించిన స్థాయిలో నిధులు, పనులు కావు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సర్కారు బడి దశ తిరగడం లేదు. మరోవైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామన్న సర్కారు ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతుంది. కానీ ఆ దిశగా చర్యలు ఉండడం లేదు. అయితే ఈ ఏడాది శాసనసభలో బడుల అభివృద్ధి కోసం సర్కారు ప్రత్యేకంగా రూ.4వేల కోట్లు ప్రతిపాదించింది. ఇందులో తొలుత రూ.2వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే నివేదికలు సైతం ప్రభుత్వానికి చేరాయి. అయితే మరోసారి సాంకేతిక ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం స్కూల్ ఇన్ఫ్రా స్టేటస్ అనే యాప్‌ను డెవలప్ చేశారు. దీనిని ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించిన హెడ్మాస్టర్లు లేదా టీచర్లను ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు సంబంధించి వివరాలు ఎస్ఐఎస్ యాప్‌లో నమోదు చేసి పంపించాలని ఆదేశించారు. ఈ పనుల్లో హెడ్మాస్టర్లు, టీచర్లు నిమగమయ్యారు.
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 682 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 492 ప్రాథమిక, 8 ప్రాథమికోన్నత, 182 ఉన్నత పాఠశాలలున్నాయి. వాస్తవానికి బడుల్లో మౌలిక సౌకర్యాలుంటేనే విద్యార్థులు చదువులపై శద్ధ్ర చూపడంతో పాటు ఎన్రోల్మెంట్ కూడా పెరుగుతుంది. కానీ ప్రస్తుతం అన్ని బడుల్లో సరిపోను మౌలిక సదుపాయాలు లేవు. కానీ ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులపై ఆరా తీస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే సోమవారం నుంచి ప్రారంభించారు. ఎస్ఐఎస్ యాప్‌లో వివరాలు నమోదుపై ప్రధానోపాధ్యాయులు, టీచర్లు దృష్టి పెట్టారు. ఈ వివరాల ఆధారంగా సౌకర్యాల లేమిపై ప్రభుత్వం నిధుల మంజూరు చేయనుంది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ఎక్కడిక్కడ వివరాలను యాప్‌లో అప్లోడ్ చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
యాప్‌లో బడి సమాచారం నిక్షిప్తం..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు లేదా ఉపాధ్యాయులు స్కూల్ ఇన్ఫ్రా స్టేటస్ ఎస్ఐఎస్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి లాగిన్ కావాలి. యూజర్ ఐడీ, డైస్ కోడ్, పాస్వర్డ్ నమోదు చేసుకుని దాని ద్వారా తిరిగి తదుపరి పేజిలోకి వెళ్లాల్సి ఉంటుంది. మొదటగా పాఠశాల ప్రాథమిక వివరాలు నమోదు కనిపిస్తాయి. ఇందులో బాలికలు, బాలుర సంఖ్య కూడా ఉంటుంది. అనంతరం తరగతి గదులకు సంబంధించి ఎనిమిది ఫోటోలు తీయాలి. బాలబాలికల వివరాల ప్రకారం.. మరుగుదోడ్ల ఫోటోలు నాలుగు తీసి అప్లోడ్ చేస్తారు. నీటివసతికి సంబంధించి రెండు ఫోటోలు, కిచెన్ షెడ్ ఉంటే ఉందని చెబుతారు. ఇక స్కూల్ క్యాంపస్ మొత్తాన్ని జియో ఫెన్సింగ్ చేయాలి. మొత్తం ఒకటి నుంచి పది ఫోటోలు తీస్తారు. అలాగే పాఠశాల పూర్తి వీడియోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇచ్చిన వివరాలు ఆధారంగా ప్రస్తుతం ఇచ్చే వివరాలను సరిచూడటానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్కారు బడుల బాగుకు కృషి చేస్తే.. వాటికి మహర్ధశ పడుతుందని పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు వివరిస్తున్నారు.
పాఠశాలల వివరాలు సేకరిస్తున్నాం
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటికీ ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎస్ఐఎస్ యాప్‌లో పాఠశాలల వివరాల నమోదుపై దృష్టిపెట్టారు. ఈ వివరాల ఆధారంగా మౌలిక సౌకర్యాల లేమిపై ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.
ఆర్.రోహిణి, డీఈవో, హైదరాబాద్
బలోపేతమయ్యే అవకాశం
ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.4వేల కోట్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తారని ఆశిస్తున్నాం. ఈ నిధులు ఖర్చుతో ప్రభుత్వ బడులు బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. కరోనా పరిస్థితుల్లో ప్రయివేటు పాఠశాలల నుంచి పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల వైపు చూస్తున్నారు.
శ్యామ్ సుందర్, అధ్యక్షుడు టీఎస్‌యూటీఎఫ్, హైదరాబాద్