Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
మోడీ ప్రభుత్వ మతోన్మాదాన్ని మట్టుబెట్టడమే నిజమైన దేశభక్తి అని, దేశసమైక్యత కోసం కేంద్ర విధానాలపై పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో సీపీఐ(ఎం) శాఖ మహాసభ పార్టీ సభ్యురాలు నాగమణి అధ్యక్షతన బుధవారం జరిగింది. ముందుగా సీపీఐ(ఎం) పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈసందర్భంగా వీరయ్య మాట్లాడుతూ దేశ ప్రజల జీడీపీ తగ్గుతూ అంబానీ ఆదాని ఆస్తులు ఎందుకు పెరిగాయంటే మోడీ కార్పొరేట్ల పక్షమే కానీ కడుపేదల పక్షం కాదన్నారు. కష్టకాలాల్లో తమ మూఢత్వంతో కరోనాను నివారించలేకపోయారన్నారు. సోషలిస్టు దేశాలు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రజలకు ఆహారం, వైద్యం అందించడంలో అగ్రభాగాన నిలిస్తే కేంద్ర ప్రభుత్వం అట్టడుగు స్థానంలో ఉందన్నారు. వైద్యం, సైన్స్‌పై దృష్టి పెట్టకుండా చప్పట్లు కొట్టడం, పూలు చల్లడం, లైట్లు ఆర్పమంటూ మూఢత్వాన్ని నూరిపోశారని విమర్శించారు.
మత సామరస్యానికి సీపీఐ(ఎం) కట్టుబడి ఉంది
దేశంలో కేరళ వామపక్ష ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడంతో అంతర్జాతీయ ప్రశంసలు అందుకుందన్నారు. కార్మిక చట్టాలను కంపెనీ యజమానుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చి కార్మిక హక్కులను కాలరాశారని విమర్శించారు. రైతువ్యతిరేక చట్టాలు తెచ్చి దేశంలో అన్నదాతలను ఉసురుపోసుకుందన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, దళితులు, గిరిజనులపై రెట్టింపు స్థాయిలో హింస పెరిగిందని ఆరోపించారు. ఏడేండ్లలో 63 సార్లు చమురు ధరలు పెంచిన గొప్ప దేశభక్తి మోడీదేనని ఎద్దేవా చేశారు. సీపీఐ(ఎం) దేశసమైక్యత, సమగ్రత, మత సామరస్యం కోసం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చింతల యాదయ్య, మండల కార్యదర్శి ఎన్ సబిత, గ్రామ శాఖ కార్యదర్శి కె.అలివేలు, సభ్యులు సీహెచ్ అరుణ, ఉమారాణి, బి సునీత, మహేందర్ సింగ్, శోభ, కె అరుణ, మాధవి పూజ, సంధ్య దేవి, వాణి, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.