Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలించిన కార్మికుల పోరాటంతో కదిలిన సర్కార్
- అన్నీ ఒకేసారి ఓపెన్ చేయాలి : మారన్న
- తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్లను ప్రారంభిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. థియేటర్స్ కార్మికుల దశలవారీగా ఆందోళన, పోరాటాలు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయం వద్ద ధర్నా వంటి కార్యక్రమాలతో సినీపెద్దలు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో సర్కార్ దిగొచ్చింది. కరోనా కారణంగా ఏడాది కాలంగా థియేటర్లు మూతపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 21వేల కార్మికులు రోడ్డున పడ్డారు. అయితే ఈనెల 23 నుంచి కొత్త సినిమాలు విడుదల అవుతుండడంతో తెరవాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. సెకండ్ వేవ్‌కు ముందు థియేటర్లు తెరిచిన 50శాతం సీట్లతోనే నడిపించారు. అయితే ఈసారి 100శాతం సీటింగ్‌తో ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.
21వేల కుటుంబాలు :
జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 600 థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లు ఉన్నాయి. 25 మల్టీఫ్లెక్స్‌లు ఒక్కోదానిలో 150 మంది అంటే 3,750 మంది పనిచేస్తున్నారు. వీటిల్లో సగం మంది మహిళలే ఉన్నారు. 575 థియేటర్లు ఒక్కోదానిలో 30మంది చొప్పున 17,250 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మల్టీఫ్లెక్స్‌లు, థియేటర్లలో కలిపి మొత్తం 21వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
రేపటి నుంచి :
సినీ ప్రియుల నిరీక్షణకు ఇక తెర పడనుంది. వెండితెర లేవనుంది. రాష్ట్రంలో సినిమా థియేటర్లు ప్రేక్షకులతో మళ్లీ కళకళలాడను న్నాయి. నగరంలో రేపటి నుంచి సినిమా థియేటర్లను ఓపెన్ చేయనున్నారు. 23న 15 సింగిల్ స్క్రీన్ థియేటర్లు, 30వ తేది నుంచి మల్టీప్లెక్సులు, ఇతర సినిమా హాళ్లు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం 'నేరగాడు' అనే లోబడ్జెట్ చిత్రాన్ని ఈ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈనెల 30 నుంచి పెద్ద సినిమాలు విడుదల వుతుండటంతో అదేరోజు మల్టీప్లెక్సులు, ఇతర థియేటర్లు ఓపెన్ కానున్నాయి. కాగా సినిమా థియేటర్లలో ఇకపై పార్కింగ్ చార్జీలు వసూలు చేయనున్నారు. పార్కింగ్ ఫీజుల వసూలుకు ప్రభుత్వం అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా మల్టీప్లెక్స్, మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయరాదని, అక్కడ పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అన్నీ ఒకేసారి తెరవాలి :
ఎన్.మారన్న, తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు
అన్ని థియేటర్లను ఒకేసారి తెరవాలి. 23, 30 తేదీల వారీగా నిర్ణయించారు. ఓటీటీలో కాకుండ థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయాలి. ఓటీటీతో ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాల్సి వస్తోంది. కార్మికుల పోరాట ఫలితంగా థియేటర్లను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం.