Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేట్ సెక్యూరిటీ ఏజెన్సీల టెండర్ ముగిసినా పట్టించుకోని అధికారులు
- పాతుకుపోయిన పాత ప్రయివేట్ ఏజెన్సీలు
నవతెలంగాణ-ఓయూ
యూనివర్సిటీ భూములు, బిల్డింగుల సంరక్షణతో పాటు వర్సిటీ భద్రతలో కీలకపాత్ర పోషించే సెక్యూరిటీ సిస్టం నిర్వహణ ఓయూలో అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అసలు ఇక్కడ సెక్యూరిటీ విభాగం ఎవరి కంట్రోల్లో పనిచేస్తుందో, ఏం చేస్తుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. రెగ్యులర్ సెక్యూరిటీ వ్యవస్థను వర్సిటీ అధికారులు సక్రమంగా పట్టించుకోకపోగా వారికి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి బెనిఫిట్స్ కల్పనలో అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ 15 ఏండ్లుగా పనిచేస్తున్న నాలుగు ప్రయివేటు ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. వాటి పరిధిలో 300 మంది పనిచేస్తున్నారు. వీరు ఓయూతో పాటుగా నిజాం కాలేజీ, కోఠి ఉమెన్స్ కాలేజీ, సైఫాబాద్, సికింద్రాబాద్ పీజీ కాలేజీలు, బేగంపేట జెనటిక్స్, పీజీ కాలేజీ, బషీర్బాగ్ లా కాలేజీలలో కూడా పనిచేస్తున్నారు. ఈ సెక్యూరిటీ ఏజన్సీల టెండర్లు ముగిసినా అవి ఇక్కడే పాతుకుపోయాయని, వాటికి చెల్లించాల్సిన వేతనాలు, బెనిఫిట్స్ వెళ్తున్నాయని వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆ ఏజెన్సీల పరిధిలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి మాత్రం వేతనాలు, బెనిఫిట్స్ సక్రమంగా ఇవ్వండం లేదు. అంటే ప్రయివేట్ నిర్వహణ ఏజెన్సీలకు లాభం జరుగుతోంది తప్ప వాటి పరిధిలో పనికేసే సిబ్బందికి మాత్రం పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత వంటివి లేకుండా పోయాయి. పైగా 55 ఏండ్లు పైబడిని వారితో వెట్టిచారికి చేయిస్తున్నారు. అదనపు గంటలు పని చేయించుకుంటూ సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓయూ ఉన్నతాధికారులు పట్టించుకుంటే రెగ్యులర్ సెక్యూరిటీ సిబ్బందితోపాటు, ప్రయివేట్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా మేలు జరిగే అవకాశముంది.
అన్నీ కటింగులే..
ఓయూలో రెగ్యులర్ సెక్యూరిటీ గార్డులకు ఒక్కోగార్డుకు రోజుకూ 8 గంటలు చేస్తే నెలకు రూ. 8, 200 చెల్లిస్తుండగా, ప్రయివేట్ ఏజెన్సీలు మాత్రం నెలకు వివిధ కంటింగ్స్ పేరుతో రూ. 6 వేల నుంచి 6, 400 వరకు మాత్రం చెల్లిస్తున్నాయి. కటింగ్ ఉంటోంది కానీ పీఎఫ్ మాత్రం అమలు కావడం లేదని కొందరు వాపోతున్నారు. ప్రయివేట్ ఏజెన్సీల నిర్వహణ తీరును పర్యవేక్షించి, వారు సమర్పించిన బిల్లులను పరిశీలించి నిధులు కేటాయించాల్సిన ఓయూ అధికారులు అవేమీ పట్టించుకోకుండా ప్రయివేట్ ఏజెన్సీలు ఇచ్చిన బిల్లులను ఓకే చేసి నిధులు కేటాయించేస్తున్నారు. దీంతో ఆ ఏజెన్సీలు బాగుపడుతుండగా సెక్యూరిటీ గార్డులు నష్టపోతున్నారు.
బదిలీలులేక ఇబ్బంలు
ఓయూలో పనిచేస్తున్న 20 మంది రెగ్యులర్ సెక్యూరిటీ గార్డ్సుకు బదిలీలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఏండ్ల తరబడి ఎక్కడివారు అక్కడే పనిచేస్తున్నారు. వీరిలో పలువురు కారుణ్య నియామకాల్లో వచ్చినవారు ఉన్నారు. మాజీ వీసీ ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ హయాంలో జరిగిన బదిలీలు తప్ప ఆ తర్వాత కొన్ని ఏండ్లు గడిచినా బదిలీలు లేకుండా పోయాయి. ప్రస్తుత ఓయూ సీఎస్వో శ్రీరాం అంజయ్య పదవీ కాలం ఇటివలే ముగిసిన విషయం తెలిసిందే. మరి వారిని ఇంకా కొనసాగిస్తారా? కొత్త వారిని నియమిస్తారా వేచి చూడాల్సిందే. తీవ్ర విమర్శలు, ఇబందుల నేపథ్యంలో ఓయూ నూతన వీసీ సెక్యూరిటీ సంస్థలకు టెండర్లు ఆహ్వానించేందుకు సన్నాహాలు చేస్తున్నాట్లు తెలిసింది. ఇప్పటికైనా ఓయూ సెక్యూరిటీ సిస్టంలో మార్పు వస్తుందా? అదే పద్ధతి కొనసాగుతుందో వేచి చూడాల్సిందే.