Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్
నవతెలంగాణ-ధూల్‌పేట్
వరదనీటిి సమస్యలను ఎప్పటికప్పుడు ఎదుర్కొనేందుకు చార్మినార్ దక్షిణ మండలి జోనల్ కమిషనర్ ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించారు. మాన్ సూన్ చర్యలు చేపట్టి అధికారులతో కలిసి పర్యటించారు. వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే స్పందించేందుకు సర్కిళ్ల వారీగా మాన్ సూన్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం జోనల్ కమిషనర్ మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతం, గుర్రం చెరువు, గగన్ పహాడ్ అప్ప చెరువు, శివరాం పల్లి తదితర ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనర్ లు. పలువురు అధికారులతో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని విభాగాల సమన్వయంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలు, శిథిలావస్థకు చేరుకుని కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలు, రోడ్లపై వర్షపు నీరు, డ్రయినేజీ మ్యాన్ హోల్ సమస్యలపై ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ లో సంప్రదించాలన్నారు. 24 గంటల పాటు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండే సిబ్బంది తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపడతారన్నారు. ఇప్పటికే కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలను గుర్తించి నోటీసీలు జారీ చేశామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సర్కీళ్లవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఆయా సర్కిల్ ప్రాంత ప్రజలు వర్షపు నీటి సమస్యలపై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు.. మలక్‌పేట్ 7995085322, సంతోష్ నగర్ 7673951166, చాంద్రాయణగుట్ట 7287952917, చార్మినార్ 9346497855, ఫలక్ నుమా 9030814363, రాజేంద్రనగర్ 8106561415 సంప్రదించాలన్నారు.