Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైమ్కురాక, సమాచారం లేక ఇబ్బంది పడుతున్న పాస్హోల్డర్లు
- సరిపోను నడపాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
అసలే వర్షాలు, ఆపై టైమ్‌కు ఆర్టీసీ బస్సులు రాక, ఎప్పుడొస్తయో తెల్వక డ్యూటీలకు, కాలేజీలకు పోయే బస్‌పాస్ హోల్డర్లు, ఉద్యోగులు, విద్యార్థులు మస్తు ఇబ్బంది పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కోటికిపైగా జనాభా ఉండగా ప్రస్తుతం 2,800 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 47 వేల ట్రిప్పులకు బదులు 25 వేల ట్రిప్పులు తిప్పుతున్నారు. ఈ క్రమంలో గల్లీలోకి, శివారు ప్రాంతాల్లోకి బస్సులు అరకొరగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే బస్సులు రద్దయినా, ఆలస్యంగా వచ్చినా ప్రయాణికులకు ఎటువంటి సమాచారం ఉండటంలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటున్నారు. ముఖ్యంగా సింగ్ రూట్లో వెళ్లే ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. రైల్వే, విమానాయ సంస్థలు తమ సర్వీస్‌లు రద్దయినా, అనుకున్న సమయానికి రాకపోయినా తమ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు సమాచారం ఇస్తాయి. రైల్వే రిజర్వేషన్ చేసుకున్న వారితోపాటు రెగ్యులర్‌గా పాస్‌లపై వెళ్లేవారికి తమ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిందనో, తిరిగి ఎప్పుడు కొనసాగించే విషయాన్ని మెయిల్ ద్వారా, ఫోన్ మెసేజ్‌ల ద్వారా చేరవేస్తాయి. దాంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని గమ్యస్థానాలకు వెళ్తారు. అయితే ఇలాంటి సౌకర్యాం ఆర్టీలో లేకపోవడంతో ప్రస్తుతం ఇబ్బందులు తప్పడం లేదని, ఆ సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు, బస్‌పాస్ హోల్డర్లు కోరుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో శివారు ప్రాంతాలు, లాంగ్ డిస్టెన్స్ (సింగిల్రూట్)లో కాలేజీ విద్యార్థులు, చిరు వ్యాపారులతో పాటు మధ్యతరగతి వారిలో అధిక సంఖ్యలో నెలవారీ, సీజనల్ బస్ పాస్‌లను తీసుకుని ప్రయాణిస్తుంటారు. పాస్ ఉండటంతో తప్పనిసరిగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలన్న ఆలోచనలతో బస్సుల కోసం ఎదురుచూస్తుంటారు. ఒకవేళ బస్సులు రద్దయినా, చెడిపోయినా ఆ రూట్లలో ఆలస్యంగా నడుస్తున్నా ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో గంటల తరబడి బస్టాండ్ లోనే వేచిచూడాల్సి వస్తోంది. ఆయా కాలనీలతోపాటు శివారు గ్రామాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. చివరకు ప్రయివేట్ వాహనాల్లో, ఆటోల్లో గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ముందస్తు సమాచారం అందిస్తే వారికి ఎంతో సౌకర్యాంగా ఉంటుదని పలువురు ప్రయాణికులు పేర్కొంటున్నారు.
అప్‌గ్రేడ్ కావాలి
తెలంగాణ పేదప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎన్.సత్తిరెడ్డి
ఆర్టీసీ అప్‌గ్రేడ్ కావాలి. టెక్నాలేజీతో ప్రయాణికులకు సరైన సౌకర్యాన్ని కల్పించాలి. విద్యుత్‌శాఖ, రైల్వే తమ వినియోగదా రులకు అసౌకర్యం కలిగితే ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా ముందస్తు సమాచారం అందిస్తారు. ఇటువంటి టెక్నాలజీని ఆర్టీసీ కూడా వినియోగించుకోవాలి.
పరిశీలిస్తాం: ఈడీ యాదగిరి
ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. వారి భద్రత, సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీతోనే సాధ్యం. బస్సులు రద్దయిన సమయంలో మల్టీపుల్ టికెట్స్ ఇష్యూ సమయంలో ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వడం సాధ్యంకాదు. అయితే సింగిల్రూట్లో ప్రయాణించే వారికి మాత్రం ఇచ్చే విషయాన్ని ఐటీ విభాగంతో చర్చించి పరిశీలిస్తాం.